– వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని.. సోనియా పేరుతో లేఖలు పంపడం నిజం కాదా?
– ఇంకా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉన్న రేషన్ కార్డులే
– అప్రజాస్వామిక భాషను కేసీఆర్ ప్రవేశపెడితే రేవంత్ కొనసాగిస్తున్నాడు.
– సీఎం రేవంత్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యలందరం ప్రధానమంత్రి ని కలిశాం. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా రిక్వెస్ట్ చేశాం. ఇవాళ ప్రధాని టైమ్ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమర్థవంతంగా ప్రాజెక్టుల అమలుకోసం.. ప్రొయాక్టివ్ గా పనిచేయాలని ప్రధాని సూచించారు. ప్రజా సమస్యల మీద ఎప్పుడూ పనిచేయాలి. ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు.
8 మంది లోక్ సభ సభ్యులం, రాజ్యసభ్యుడైన డాక్టర్ లక్ష్మణ్ .. 7 శాసన సభ్యులు, ఒక ఎమ్మెల్సీ అందరం కలిశాం. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర రెడ్డి కూతురు వివాహ పనులున్నందున హాజరు కాలేదు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. వారం, పదిరోజుల్లో సంవత్సరం పూర్తికానుంది. ఎన్నికలకు ముందు హామీలు, డిక్లరేషన్లు, గ్యారెంటీలు, సబ్ గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
సమస్యల మీద మాట్లాడితే.. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి దాడి చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో.. రేవంత్ వ్యవహరిస్తున్నారు. మూసీ మీద ఆందోళన చేస్తే.. వ్యక్తిగతంగా మాట్లాడతారు తప్ప సమాధానం ఇవ్వరు. ఏడాది కాలంలో మీరేం పనిచేశారో చెప్పండి.
7న ప్రమాణ స్వీకారం చేస్తాం.. 9న సోనియా జన్మదినం సందర్భంగా.. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఏమైంది? డిసెంబర్ 9న పింఛన్లు పెంచుతామన్నారు? ఏమైంది? వందరోజుల్లో 6 గ్యారెంటీలు. ఏడాదిలో 420కి పైగా సబ్ గ్యారెంటీలు పూర్తిచేస్తామని చెప్పారు. ఏమైంది. ఇది పూర్తి వైఫల్యం. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగ యువత.. విద్యారంగం ఇవాళ అన్ని రంగాల్లో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి.
ఇవేవీ సాధించలేదు.. కానీ.. వారంరోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు. ఏడాదిలో ఏం సాధించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలిమాటలు తప్ప.. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించిందేమీ లేదు. నేను సమస్య గురించి మాట్లాడితే.. కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటి అని అడుగుతున్నారు. నా డీఎన్ఏ బీజేపీ డీఎన్ఏ. మీలాగా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదు.. బీజేపీ పార్టీ తరపున.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలమీద.. డిసెంబర్ 1 నుంచి 5 వరకు.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.
నాలుగైదు నెలలుగా.. రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అనేక రకాలుగా సంఘటనలు జరుగుతున్నాయి. విపక్షాలను తిట్టడం మీద పెట్టే దృష్టి పాలనమీద పెడితే.. రాష్ట్రం పరిస్థితి బాగుంటుంది. కానీ సీఎం దీన్ని పట్టించుకోవడం లేదు. రెండ్రోజుల క్రితం కొమురం భీం జిల్లాలో.. శైలజ అనే అమ్మాయి.. ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోయింది. దీని మీద సీఎం కనీసం దృష్టిపెట్టరు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయరు. సంబంధం లేని విషయాలపైనా ఆయనకు ఆసక్తి ఎక్కువ.
అందుకే బీజేపీ తరపున.. రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా.. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనమీద దృష్టిపెట్టాలని కోరుతున్నాను. రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో.. తెలంగాణ నష్టపోతోంది. తెలంగాణ గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కారణంగా.. రాష్ట్రం నష్టపోతోంది. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతోంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత దాడులు.. అసాధ్యమైన అంశాల్లో.. ప్రజలను మభ్యపెట్టేలా పనులు చేయడంలో ఇద్దరూ ఇద్దరే.
కాంగ్రెస్ వాళ్లు.. బీఆర్ఎస్ వాళ్లను చేర్చుకున్నారు.. బీఆర్ఎస్ వాళ్లు.. కాంగ్రెస్ వాళ్లను చేర్చుకున్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. సకాలంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిస్సిగ్గుగా.. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారు బీఆర్ఎస్ లో చేరి.. మంత్రులయ్యారు. ఆ పార్టీ నాయకులు.. అక్కడ గెలిచి.. ఇక్కడ మంత్రులయ్యారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకన్నా రికార్డులు, సాక్ష్యాలు ఇంకేం కావాలి?
ప్రభుత్వాలు హామీల అమలుకు సమయం ఇవ్వాలి. కానీ రెండ్రోజుల్లో హామీలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం.. వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని.. సోనియా గాంధీ పేరుతో లేఖలు పంపడం.. నిజం కాదా? నిరుద్యోగులు.. రాహుల్, రేవంత్ చెప్పిన మాటలను విని మోసమోయారు. జాబ్ క్యాలెండర్లు విడుదలతో యువతను మోసం చేశారు. రైతులకు రైతు భరోసా.. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బుల సంగతేంది? మహిళలకు రూ.2,500 ఇస్తామన్న సంగతేమైంది?
నిరుద్యోగ భృతి, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు? ఎందరికి అందింది? సుమారు 13 పంటలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. కనీసం వరికి కూడా ఇవ్వకుండా.. సన్నబియ్యం, దొడ్డు బియ్యం అని కొత్త రూల్స్ జోడించడం దారుణం. ధాన్యం కొనుగోలును.. కేంద్రం డబ్బులిచ్చి కొంటుంటే.. కొనుగోలు కేంద్రాల నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదు. మహిళలకు సంబంధించి.. తులం బంగారం, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్, దివ్యాంగుల పింఛన్.. ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఉన్నది సరిగ్గా ఇవ్వడం లేదు.
రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉన్న రేషన్ కార్డులే ఇంకా నడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు అవుతున్నా.. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేక పోవడం దురదృష్టకరం.
పాలనమీద దృష్టిపెట్టాలని కాంగ్రెస్ కు సూచిస్తున్నాను. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలి.
ఎవరైనా సమస్యమీద మాట్లాడితే.. వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం, దిగజారి మాట్లాడే ప్రయత్నం సరికాదు. అప్రజాస్వామిక భాష మాట్లాడటాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే.. రేవంత్ కొనసాగిస్తున్నాడు. అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ పాత అలవాటు ప్రకారం.. అవినీతి విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది.
గతంలో.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పులమీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపితే.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. చిన్న చిన్న పట్టణాలకు కూడా డెవలప్ మెంట్ అథారిటీలు ఏర్పాటుచేసి.. డబ్బులు ఖర్చుచేస్తున్నారు. 30వ తేదీనాడు. దీనిపై విస్తృతస్థాయిలో హైదరాబాద్ లో చర్చిస్తాం. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్తాం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం.
అమెరికాలో చట్టాల అమలు విషయం అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది. పార్లమెంటు సమావేశాలకు ముందు.. ఏదో ఒక ఇలాంటి అంశాన్ని సృష్టించి.. కుట్ర చేస్తున్నారు. ఇది కుట్రపూరితమైన చర్య. తప్పు జరిగితే.. చర్యలు తీసుకోవాల్సిందే తప్ప అనవసర విమర్శలు చేయొద్దు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. చేయదు. ప్రజా సమస్యల మీద పోరాడండి, కేంద్రప్రభుత్వ పథకాలు అమలుచేయండి. క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా పనిచేయాలని మోదీ సూచించారు. ఆ మార్గంలోనే మేం ముందుకెళ్తున్నాం.
డిసెంబర్ చివరి నాటికల్లా.. సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయి. పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుంది. కర్ణాటకలో ఇవాళ ఎన్నికలు జరిగినా.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పాలిస్తున్న 3 రాష్ట్రాల్లో.. దయనీయమైన పరిస్థితులున్నాయి. 11 నెలల్లోనే.. 11 ఏండ్లలో రావాల్సిన వ్యతిరేకత కాంగ్రెస్ పాలనకు వస్తోంది.