– మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు కాదు
– నువ్వు, నీ కుటుంబం గుడిసె వేసుకొని జీవించి చూపించు
– మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు బాగుపడటం బి ఆర్ ఎస్ కి ఇష్టం లేదు
– 10 సంవత్సరాలు పాలించిన బి ఆర్ ఎస్ నగర అభివృద్ధికి పది పైసలు ఖర్చు చేయలేదు
– ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ ను మార్చాలన్న సంకల్పంతో ప్రణాళికలు
– నెక్లెస్ రోడ్డులో జరిగిన తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోవడం కాదు. అక్కడే గుడిసె వేసుకొని నువ్వు నీ కుటుంబం చిరస్థాయిగా జీవించి చూపించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి మూసి పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోయి తర్వాత నుంచి విలాసమైన ప్యాలెస్ లో ఉండటం సరికాదని అన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో “హైదరాబాద్ రైజింగ్” ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తున్న మూసీ నదికి పునర్జీవం తీసుకువచ్చి మురికి కూపంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం ఆకర్షించే విధంగా పర్యాటకంగా, అందంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి చేసి, మూసిని జీవ నదిగా మార్చాలని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుండగా, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు బాగుపడటం ఇష్టంలేని ప్రతిపక్షాలు మూసి పునర్జీవం కి అడ్డుపడుతున్నాయని అన్నారు.
ప్రపంచంలో ఏ నగరానికి వెళ్లిన నగరం మధ్యలో నుండి ప్రవహిస్తున్న నదులను పర్యాటకంగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆరోగ్యంగా అభివృద్ధి చేసుకొని జీవ నదిగా అక్కడి ప్రభుత్వాలు మార్చుకుంటున్నాయి. అదే విధంగా హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్ల పైగా ప్రవహిస్తున్న మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి పునర్జీవం తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది.
గోదావరి నీళ్లను తీసుకువచ్చి మూసీలో కలిపి పునర్జీవం తీసుకువచ్చి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి విద్య ఉపాధి అవకాశాలు పెంచితే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించలేమన్న భయంతో కుట్రపూరితంగా బిఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు మురికి కూపంలోనే ఉండాలి, వారి ఆరోగ్యాలు బాగు కావొద్దు, వారికి ఇండ్లు రావద్దు, మంచి జీవితం రాకుండా కుట్రపూరితంగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు మంచి జీవితం అందించాలని, అక్కడ నివాసం ఉంటున్న ఇండ్లకు పట్టాలు ఉన్న లేకున్నా గుడిసెలు వేసుకున్న వారిని కూడా గుర్తించి వారికి అందమైన టవర్లు నిర్మించి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నదని చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించి వారిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ నగరం మీద ప్రేమ, పేదవాళ్లపై అభిమానం ఉంటే సహకరించాల్సింది పోయి కుట్రలు చేయడం మానుకోవాలని బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. హైదరాబాద్ నగరానికి మూసి నది అంది వచ్చిన వరం లాంటిదని దానిని బాగు చేసుకుందామని మూసి పునర్జీవం కోసం ప్రజా ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు.
హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఈ సంవత్సరం బడ్జెట్లో హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం పది వేల కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులకు సజావుగా ప్రయాణించేందుకు అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు నిర్మాణం చేసి రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 400 స్లమ్స్ లలో నివాసం ఉంటున్న మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చడానికి మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు.
ఢిల్లీ లాంటి ముప్పు హైదరాబాదు నగరానికి రావొద్దన్న ముందు చూపుతో ప్రజా ప్రభుత్వం కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్ది భవిష్యత్తు తరాలకు అందించడానికి అనేక ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నదన్నారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను అవసరమైతే ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి పంపిస్తామని చెప్పారు. కాలుష్య, డ్రగ్స్ రహితంగా, అత్యంత భద్రత కలిగిన నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదని చెప్పారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడింది ప్రజా ప్రభుత్వమని ఇది దొరల ప్రభుత్వం గడీల ప్రభుత్వం కాదన్నారు. ప్రజాస్వామ్య యుతంగా స్వేచ్ఛాయితంగా నిర్ణయాలు తీసుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సమిష్టిగా రూపకల్పన చేసుకుందామన్నారు.
పదేళ్లలో పది పైసలు ఖర్చు చేయని గత బీఆర్ఎస్ పాలకులు
హైదరాబాదు నగరం రాష్ట్రానికే తలమానికం కాదని దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేయబోతున్న నగరంగా మారబోతున్నదని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రిమండలి సభ్యులందరం చర్చించి హైదరాబాదుకు కావలసిన అన్ని హాంగులను తీసుకురావడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని వెల్లడించారు.
10 సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ పాలకులు హైదరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి రంగులు వేసుకొని పదేండ్లు కాలం వెళ్ళదీశారని అన్నారు. పది సంవత్సరాలు పరిపాలించి పది పైసలు కూడా హైదరాబాదు నగరం కోసం ఖర్చు చేయని గత బిఆర్ఎస్ పాలకులకు విమర్శలు చేసే అర్హత లేదన్నారు.
హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నగరవాసులకు ఇప్పుడు అందుతున్న గోదావరి, కృష్ణ, మంజీరా నీటి పథకాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన ఫలితమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి కల్పన కొరకు బీహెచ్ఈఎల్ ఈసీఐఎల్ డిఆర్డిఓ ఐడిపిఎల్, బీడీఎల్, డిఆర్డిఏ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఆనాటి కాంగ్రెస్ పాలకులే తీసుకువచ్చారని వివరించారు.
పరిశ్రమలు తీసుకురావడంతో పాటు అందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్న వారికి, హైదరాబాద్ వలస వచ్చి బతుకుతున్న పేదలకు హౌసింగ్ బోర్డ్ ద్వారా ఎల్ఐజి, హెచ్ఐజి, ఎంఐజి ఇండ్లను అందించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. హైదరాబాదులో ఐటి రంగాన్ని అభివృద్ధి చేయడానికి దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తీసుకు వచ్చిన కంప్యూటర్ విప్లవమేనని పేర్కొన్నారు.
హైటెక్ సిటీ వేదికగా ఐటి రంగాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన వనరులు అందులో పనిచేయడానికి కావలసిన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి అందులో చదివిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఐటి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అన్నారు.