Suryaa.co.in

Editorial

తిట్టిపోసిన వారికే తథాస్తు!

  • టీడీపీలో చేరికల అసంతృప్తి

  • నేడు టీడీపీలో ఆళ్ల నాని చేరికకు ముహుర్తం

  • వ్యతిరేకిస్తున్న జిల్లా పార్టీ తమ్ముళ్లు

  • అసలు ఇప్పుడు వైసీపీ వారు ఎందుకంటూ ప్రశ్న

  • ఉన్నవారికి న్యాయం చేయండి చాలంటూ చురకలు

  • ఎమ్మెల్యే బడేటి చంటిని నిలదీసిన తమ్ముళ్లు

  • మా మనోభావాలతో పనిలేదా అని కన్నెర్ర

  • ఎవరినడిగి నానిని చేర్చుకుంటున్నారన్న ఆగ్రహం

  • కార్యకర్తల ప్రశ్నలతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి

  • నాయకత్వం దృష్టికి తీసుకువెళతానన్న ఎమ్మెల్యే చంటి

  • వైసీపీ నేతల చేరికను వ్యతిరేకి స్తున్న టీడీపీ క్యాడర్

  • ఎన్నికల ముందు వారంతా వైసీపీలోకే వెళతారన్న వాదన

  • స్థానిక నేతల అభిప్రాయం అవసరం లేదా అని ప్రశ్నల వర్షం

  • విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, అవినాష్‌రెడ్డి, సజ్జల, అప్పిరెడ్డి రోజా, కొడాలి, వంశీ, గుడివాడ, అంబటి, నందిగం సురేష్, దేవినేని అవినాష్‌ను కూడా చేర్చుకుంటారా అని తమ్ముళ్ల వ్యంగ్యాస్త్రాలు

  • రాష్ట్రం అంతటా ఇదే నిరసన స్వరాలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేతలు తమ పార్టీలో చేరడాన్ని తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ జమానాలో తమపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి ఆర్ధికంగా-మానసికంగా నష్టపరిచిన వైసీపీ నేతలను ఏవిధంగా పార్టీలో చేర్చుకుంటారని నిలదీస్తున్నారు. అసలు వారిని పార్టీలో చేర్చుకునే ముందు స్థానిక పార్టీ నేతల మనోభావాలు గౌరవించరా? ఇలాగైతే ఇక మేమంతా పార్టీ కోసం నష్టపోయి పనిచేయడమెందుకు? మీరు మాకు విలువ ఇవ్వకపోతే.. మేం మీకు ఎందుకు విలువ ఇవ్వాలంటూ తెలుగుతమ్ముళ్లు అగ్గిరాముళ్లవుతున్నారు.

కార్యకర్తలే మాకు ప్రధానం అని ఎన్నికల ముందు చెప్పిన అధినేత చంద్రబాబునాయుడు మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని, జిల్లా పార్టీ నేతలు ఏకతాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను పట్టించుకోకుండా, నాయకత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమే దానికి కారణంగా కనిపిస్తోంది.

ఏలూరు నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేడు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో , టీడీపీ శ్రేణులు ఆయన రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాక వల్ల పార్టీకి వచ్చే అదనపు లాభం ఏమిటి? ఆయనకు అంత బలం ఉంటే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? వచ్చే ఎన్నికల్లో పెరిగే నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకే నాని వస్తున్నారు తప్ప, టీడీపీపై ప్రేమతో కాదు. ఐదేళ్ల వైసీపీ హయాంలో మేం ఎంత బాధ పడ్డామో నాయకత్వానికి ఏం తెలుస్తుంది? మమ్మల్ని వేధించిన నానిని పార్టీలోకి తీసుకువచ్చి, నాయకుడిగా మాపై రుద్దితే మేం ఎందుకు ఆమోదిస్తామంటూ.. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిపై, కార్యకర్తలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వైనం పరిశీలిస్తే, స్థానిక పార్టీ శ్రేణుల మనోభావాలతో పనిలేకుండా నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై.. శ్రేణుల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందో ఆళ్ల నాని చేరిక స్పష్టం చేసింది.

అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే చంటి సైతం నిస్సహాయంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. నాయకత్వ నిర్ణయాన్ని సమర్థిస్తానని ఏదో మొహమాటంగా, తప్పక చెప్పినట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. నాయకత్వ నిర్ణయాన్ని ఆమోదిస్తాం. కానీ ఇక్కడ కార్యకర్తలు నాని చేరికపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారంటూ.. పరోక్షంగా నాని చేరిక తనకూ ఇష్టం లేదని చెప్పకనే చెప్పినట్లు స్పష్టమవుతోంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలంతా ఆళ్ల నాని రాకను వ్యతిరేకిస్తుండటం విశేషం. నాయకత్వం మాత్రం జిల్లా నేతలెవరితో సంద్రించకుండానే ఆళ్ల నానిని పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తి భగ్గుమంటోంది.

కాగా ఈ పరిస్థితి ఒక్క ఏలూరులోనే కాదు. రాష్ట్రం మొత్తం ఇదే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజంగా వైసీపీ నేతలకు ప్రజల్లో బలం ఉంటే ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు? వాళ్లు మా పార్టీలోకి వచ్చి పనులు, పైరవీలతో సంపాదించుకునేందుకే వస్తున్నారు. ఎన్నికల ముందు మళ్లీ వెనక్కి వెళ్లిపోతారు. ఈ విషయాన్ని మేం ఎవరికి చెప్పాలి? మాకు అపాయింట్‌మెంట్లు ఇచ్చేదెవరు? ఎన్నికల ముందు కార్యకర్తలు నా కుటుంబసభ్యులతో సమానమని బాబుగారు చెప్పారు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్లను చేర్చుకునేముందు కుటుంబసభ్యుల అభిప్రాయాలు తెలుసుకోరా? కుటుంబసభ్యులంటే ఎవరు? మేం ఐదేళ్లు ఎవరిపైనయితే యుద్ధం చేశామో వారినే తీసుకువచ్చి మాపై రుద్దితే ఎలా సహిస్తాం? అని కార్యకర్తలు, ద్వితీయస్థాయి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

పార్టీ నాయకత్వం తీరు చూస్తుంటే.. జగన్ జమానాలో బాబు కుటుంబాన్ని ఇష్టారీతిన తట్టిపోసిన విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గౌతంరెడ్డి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, కాకాణి, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, గుడివాడ అమర్నాధ్, అంబటి రాంబాబు, పార్టీ ఆఫీసుపై దాడి చేయించిన దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుని.. కండువా కప్పేలా ఉందంటూ పసుపు దళాలు సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీలో పనిచేసిన వారిని గౌరవించకుండా, అవసరాల కోసం వచ్చే వారికి కండువాలు కప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలతో టీడీపీ సోషల్‌మీడియా సైనికులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

LEAVE A RESPONSE