రామచంద్రపురంలో త్వరలో మూడు పరిశ్రమలు ఏర్పాటు
రూ.5 కోట్లతో హెల్దీ హార్ట్ మిషన్ ప్రణాళిక
అత్యవసరంగా రూ.75 లక్షల పనులకు హామీ
కె.గంగవరం : రామచంద్రపురం నియోజవర్గం కె గంగవరం మండలంలోని దంగేరు గ్రామ అభివృద్ధికి రూ. నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గురువారం దంగేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే విధంగా మన గ్రామం- మన సుభాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సుభాష్ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, దశలవారీగా ఐ యాం మండలాల, గ్రామాల అభివృద్ధి పనులన్నీ ప్రాధాన్యత క్రమంలో చేస్తున్నామన్నారు. త్వరలోనే రామచంద్రపురంలో మూడు పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. దంగేరు గ్రామంలో కోటి 17 లక్షలుతో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని, రూ. 7.6 లక్షలతో మినీ గోకులం షెడ్లు నిర్మించామన్నారు.
ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదంతో త్వరలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా( ఎం ఎస్ ఎం ఈ) ద్వారా 120 ప్రాజెక్టులు ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. రూ. 30 లక్షలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ నిధులు సమకూర్చేందుకు సమ్మతించారని, కైలాస భూమికి సంబంధించి మరో రూ. 20 లక్షలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని, మిగిలిన మొత్తానికి అదనంగా నిధులు జతచేసి తాను మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తానని మంత్రి సుభాష్ హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షo వ్యక్తం చేశారు.
పక్షవాతం బారిన పడిన ప్రజలకు వైద్య సేవలు అందేలా ఫిజియోథెరపీ 4 యూనిట్లు రప్పిస్తున్నామన్నారు. వేలాది రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులు కేవలం రూ.200 రూపాయలకే చేస్తామని చెప్పారు. త్వరలోనే రక్త నిధి, అనాధ శరణాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.