Suryaa.co.in

Editorial

సన్నాఫ్..సజ్జల!

– పోసాని తిట్లపర్వంలో తండ్రీకొడుకులపై కేసుల ఉచ్చు?
– తన తిట్లకు స్క్రిప్టు సజ్జల, వీడియోలను వైరల్ చేసింది సజ్జల భార్గవ అని అంగీకరించిన పోసాని
– తండ్రి సజ్జల పథకం.. కొడుకు సజ్జల అమలు
– జగన్ కుటుంబంలో చీలికలకూ సజ్జలే కారణమంటూ బహిరంగ ఆరోపణలు
– షర్మిలతో జగన్ విబేధాలకు సజ్జల సూత్రధారన్నదే షర్మిల కుటుంబం ఆగ్రహం
– షర్మిల పాదయాత్రతోనే అది మొదలయిందట
– షర్మిలను వైఎస్‌లా చేతులు ఊపవద్దని జగన్ జైల్లో ఉన్నప్పుడే చెప్పారా?
– షర్మిలకు రాజ్యసభ రాకుండా సజ్జలే అడ్డుపడ్డారా?
– అది సజ్జల సలహాలతోనేనన్నది షర్మిల కుటుంబం అనుమానం
– ఇప్పుడు పోసాని అరెస్టుతో చిక్కుల్లో తండ్రీకొడుకులు
– నేడో రేపో అరెస్టు ఖాయమా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

తన తండ్రి కొన్న భూమి పేపర్లను ఆయన మిత్రుడికి తిరిగి ఇచ్చేసే క్రమంలో దాని లక్ష్యసాధన కోసం హీరో కేరళ వరకూ వెళతాడు. అక్కడి విలన్‌కు దగ్గరయి, అతగాడిలో మార్పు తెచ్చి అనుకున్న సమయానికి ఆయన వద్ద ఉన్న పేపర్లను తీసుకువచ్చి, తన తండ్రి మిత్రుడికి స్వాధీనం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఇది అప్పట్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కథ.

సీన్ కట్ చేస్తే.. కేరళ మాదిరిగానే బెజవాడలోనూ అలాంటి సీన్! కాకపోతే అక్కడ అల్లు అర్జునయితే, ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి. సినిమాల్లో తండ్రి కారెక్టర్ రాజేంద్రప్రసాదయితే, బెజవాడలో సజ్జల తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్. ఇందులో సీన్లు, ఫైటింగులూ మినహాయిస్తే కథ అంతా అటు ఇటుగా సేమ్‌టు సేమ్.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం విలన్లతో యుద్ధం చేసి లక్ష్యం సాధిస్తే.. బెజవాడ సన్నాఫ్ సజ్జల సినిమాలో, సజ్జల భార్గవరెడ్డి తన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం.. జగన్ ప్రత్యర్ధులను సోషల్‌మీడియా ద్వారా తిట్టించడంలో సక్సెస్ అయ్యారు. ఇదీ టూకీగా కేరళ సన్నాఫ్ సత్యమూర్తి, బెజవాడ సన్నాఫ్ సజ్జల సినిమాల మధ్య ఉన్న తేడా!

జగన్ జమానాలో సర్కారు సలహాదారు కమ్ వైసీపీ ప్రధాన కార్యదర్శిగా జమిలి బాధ్యతలు పోషించిన సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ ప్రత్యర్ధులను సోషల్‌మీడియాలో పోసాని, శ్రీరెడ్డి లాంటి వారి ద్వారా న‘బూతో’నా భవిష్యతి అన్నట్లు తిట్టించిన సజ్జల తనయుడు, వైసీపీ సోషల్‌మీడియా సారథి సజ్జల భార్గవరెడ్డి.. ఇప్పుడు జమిలిగా జైలు కష్టాలు ఎదుర్కోనుండటం చర్చనీయాంశమయింది. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మరగుజ్జులను చేసి సర్వం తానై పాలన నడిపిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు భార్గవరెడ్డి.. ఇప్పుడు తాము పెంచి పోషించిన పోసాని అనే వెకిలిరాజా ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అరెస్టయ్యే ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ మేరకు పోలీసులు చర్యల కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించారన్న జనసేన నేత ఫిర్యాదుపై పోసానిని అరెస్టు చేసిన పోలీసులు, ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోసానిని విచారించిన పోలీసులకు.. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే తాను పవన్, చిరంజీవి, చంద్రబాబు కుటుంబాలను దూషించానే తప్ప, తన తెలివితేటలతో సొంతంగా తిట్టిందేమీలేదని పోసాని పూసగుచ్చినట్లు వెల్లండించారు. అదే ఇప్పుడు తండ్రీకొడుకులను అరెస్టు చేసే బ్రహ్మాత్రంగా మారింది. దానితో ఇప్పుడు సహజంగా అందరి చూపు సన్నాఫ్ సజ్జల, తండ్రి సజ్జలవైపే నిలిచింది.

ముద్దాయి పోసాని ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు సజ్జల, ఆయన తనయుడిని అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. పోసాని ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే.. వారిపై సెక్షన్ 49, సెక్షన్ 61 ఇన్ బిఎన్‌ఎస్, ఐటి యాక్ట్ 66ఏ ప్రకారం సజ్జల, ఆయన తనయుడిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో నిందితుడిని 60 రోజులలో కస్టడీలోకి తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు చట్టాలు మారిన నేపథ్యంలో, దానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు. కేసు విచారణ మధ్యలో ఎప్పుడైనా అరెస్టు కోరవచ్చని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు పోలీసులు తండ్రీకొడుకులపై ఉచ్చు బిగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

నిజానికి జగన్ జమానాలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినే త పవన్ కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ అగ్రనేతలపై సోషల్‌మీడియా ద్వారా బురదచల్లడంలో సన్నాఫ్ సజ్జల సక్సెస్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, అనూరాధ, వంగలపూడి అనితను.. బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సుజనాచౌదరి, సీఎం రమేష్‌ను.. సన్నాఫ్ సజ్జల ఆధ్వర్యంలోని సోషల్‌మీడియా దళాలు లక్ష్యంగా చేసుకుని, తిట్టిపోసే బూతుల ఎపిసోడ్ ఐదేళ్లు విజయవంతంగా నడిచింది.

తన ప్రత్యర్ధులను తిట్టిపోయడంలో, చురుకుదనం చూపిస్తున్న సన్నాఫ్ సజ్జల ప్రతిభకు ముచ్చటపడ్డ జగన్.. పార్టీ సోషల్‌మీడియా పగ్గాలు ఆయన చేతికే అందించారు. దానితో సజ్జల స్క్రిప్టును వైసీపేయులు ప్రెస్‌మీట్లలో చదవడం, దానిని సన్నాఫ్ సజ్జల సోషల్‌మీడియాలో వైరల్ చేయించడం అనే బూతుల యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి, జగనన్న పెదవులపై చిరునవ్వులు చిందించారు.
నిజానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడే, టీడీపీ నేతలు సన్నాఫ్ సజ్జలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్‌ను విమర్శించే టీడీపీ మహిళా నేతలను సైతం భార్గవ విడిచిపెట్టలేదు. వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఎవరైతే టీడీపీలో చురుకుగా ఉంటూ వైసీపీపై విరుచుకుపడుతున్నారో వారిని గుర్తించి, తిట్టించే స్క్రిప్టు తన పార్టీ నేతలకు పంపించడం సజ్జల బాధ్యతయితే.. పేటీఎం దళాలలతో వారిని తిట్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేయించడం సన్నాఫ్ సజ్జల బాధ్యత. ఇలా టీడీపీ నేతలను సోషల్‌మీడియా ద్వారా భ్రష్ఠు పట్టించడంలో సన్నాఫ్ సజ్జల సక్సెస్ అయి, జగన్ మెప్పు పొందారు.

చివరకు సజ్జల అండ్ సన్.. జగన్ చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను కూడా విడిచిపెట్టకపోవడమే ఆశ్చర్య. జగన్‌తో విబేధించి, కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షురాలయిన షర్మిలారెడ్డి, ఆమెతో ఉన్న తల్లి విజయమ్మను సోషల్‌మీడియాలో దారుణంగా తిట్టిపోయించిన ధైర్యం, సజ్జల అండ్ సన్‌దేనంటున్నారు. షర్మిలను వ్యక్తిత్వ హననానికి గురిచేసి, అసలు ఆమె వైఎస్‌కే పుట్టలేదంటూ విజయమ్మ పైనే అనుమానం రేపిన ఘనత, భార్గవ ఆధ్వర్యంలోని సోషల్‌మీడియా బృందాలదేననన్నది షర్మిల కుటుంబ ఆగ్రహం.

సొంత చెల్లెమ్మ కేరక్టర్‌ను దారుణంగా అవమానించి, తల్లినీ తిట్టిపోస్తున్న వైసీపీ సోషల్‌మీడియా బృందాలను జగన్ నివారించలేదంటే, ఆయన సన్నాఫ్ సజ్జలకు ఏ స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి. నిజానికి జగన్ అనుమతి-ఆదేశాలు లే పోతే సజ్జల అండ్ సన్ షర్మిల-విజయమ్మను తిట్టించే సాహసం చేయరని, షర్మిల కుటుంబసభ్యులు ఆనాడే అనుమానించారు.

అసలు జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడే సజ్జల.. వైఎస్ కుటుంబంలో విబేధాలు సృష్టించారని షర్మిల కుటుంబసభ్యులు ఇప్పటికీ చెబుతుంటారు. భారతి కోరిక మేరకు షర్మిల పాదయాత్రకు బయలుదేరిన తర్వాత, ఆమె పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిన విషయం తెలిసిందే. అచ్చు వైఎస్ మాదిరిగా దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం, చేతులు అటు ఇటు తిప్పటం, సందర్భానుసారంగా సామెతలు వాడటంతో షర్మిల జనాలకు కరెక్టయిపోయారు. ఒక మహిళ అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఇపటికీ ఒక రికార్డు.

ఆ సమయంలో సాక్షి బాధ్యతలు చూస్తున్న సజ్జల, ఆమె పాదయాత్ర ఫీడ్‌బ్యాక్‌ను నిరంతరం జైల్లో ఉన్న జగన్‌కు అందించేవారట. ఆ క్రమంలో ఇక పార్టీ నీ చేతులో ఉండదని, షర్మిల అచ్చం వైఎస్‌లా చేతులు అటూ ఇటూ తిప్పడం, ఆయనలా మాట్లాడుతుండటంతో జనం ఆమె వైపు ఆకర్షితులవుతారని చెప్పారన్నది షర్మిల కుటుంబసభ్యుల భావన.

దానితో జైలుకు వచ్చిన షర్మిలను ‘‘ పాపా.. నువ్వు అలా నాన్న మాదిరిగా చేతులు అటూ ఇటూ తిప్పవద్దు. బాగుండదు. రెండు చేతులతో నమస్కారం పెట్టు. ఎక్కువ మాట్లాడవద్దు. సింపుల్‌గా మాట్లాడు’’ అని చెప్పడంతో, భర్తకు కూడా చెప్పకుండా.. అన్నమీద అమితమైన ప్రేమతో.. నా తండ్రి కోసమంటూ మండుటెండల్లో పాదయాత్రకు బయలుదేరిన షర్మిల, అన్నమాటలకు ఖంగుతిన్నదట.

నిజానికి ఆమె తన భర్త బ్రదర్ అనిల్‌కు చెప్పకుండానే, తండ్రి తర్వాత తండ్రిలా భావించే అన్న కోసం పాదయాత్రకు బయలు దేరిన విషయాన్ని షర్మిల కుటుంబసభ్యులు ఇప్పటికీ చెబుతుంటారు. అసలు పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజ్యసభ స్థానం లభించిన సమయంలో కూడా.. షర్మిలను ఎంపి కాకుండా, ‘‘కుటుంబంలో ఒకరే రాజకీయాల్లో ఉండాలి. నువ్వు వ్యాపారాలు చూసుకో. నేను రాజకీయాలు చూసుకుంటానని’’ షర్మిలతో చెప్పించింది కూడా సజ్జలనే అని, దానివెనక భారతీరెడ్డి ఉన్నారన్నది షర్మిల కుటుంబసభ్యుల అనుమానం.

 

LEAVE A RESPONSE