Suryaa.co.in

Andhra Pradesh

‘సూపర్ సిక్స్’ అమలు చేసి తీరుతాం

* బడ్టెట్ ల్ రైతులకు, బీసీలకు పెద్దపీట
* జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు
* ఇప్పటికే ఉచిత ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం
* ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతాం
* జగన్ లా మాట తప్పే నైజం చంద్రబాబుది కాదు
* రాయలసీమను రతనాల సీమ చేస్తాం
* చేసిన తప్పులకు ఎంతటివారికైనా శిక్షలు తప్పవు
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

పెనుకొండ/సోమందేపల్లి : ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేసి తీరుతామని, దీనిలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు విద్యార్థులుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. అన్నదాత పథకాన్ని కూడా జూన్ లోనే అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ నెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శనివారం సోమందేపల్లి మండలం మాగెచెరువులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, రూ. 12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించిన మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత ఇసుక, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామన్నారు.

వచ్చే జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తల్లికి వందనం పథకం కింద స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే ఆ అందరికీ ఆ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వైఎస్ జగన్ లా తమ నాయకుడు మాట తప్పే మనిషి కాదన్నారు. అమ్మఒడి పేరుతో స్కూల్ కు వెళ్లే విద్యార్థులందరికీ సాయమందిస్తామని చెప్పి తల్లులను మోసం చేశాడని విమర్శించారు. కేవలం ఇంటిలో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేశారన్నారు.

త్వరలో రేషన్ కార్డులు, ఆటోలు పంపిణీ

త్వరలో నూతన రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ఆర్థిక సాయం అందిస్తామని, కొత్తగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టనున్నామని తెలిపారు. త్వరలో నిరుద్యోగ యువతకు ఆటోలు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వాటితో పాటు డెయిరీ, ఇతర యూనిట్లు కూడా నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. 2024-25కు సంబంధించి కొంతమందికి ఇప్పటికే స్వయం ఉపాధి యూనిట్లు కోసం ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూతన లబ్ధిదారులతో యూనిట్లు నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు.

8న కుట్టు మిషన్ల పంపిణీ

ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 85 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ నియోజక వర్గంలోనూ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నామన్నారు. సోమందేపల్లిలో టైలరింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నామని, మహిళలంతా పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. పేర్లు నమోదు చేసుకున్నవారందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నామన్నారు.

బడ్జెట్ లో రైతులకు, బీసీలకు పెద్దపీట

శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు, బీసీలకు సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారని మంత్రి సవిత తెలిపారు. . రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రూ. 3,22,359 కోట్లు భారీ బడ్జెట్ ను మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాల కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారన్నారు. పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, తల్లికి వందనం పథకం అమలుకు 9,407 కోట్లు కేటాయించారన్నారు. వ్యవసాయానికి 48,340 కోట్లు కేటాయిస్తూ, రైతులతో పాటు బీసీలకూ బడ్జెట్ లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా బీసీలకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేటాయింపులు చేశారన్నారు.

జనాలను మోసగించిన జగన్

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా చేపట్టలేదని, కనీసం కాలువల్లో తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి సవిత మండిపడ్డారు. సీపీఎస్ రద్దు అంటూ సీపీఎస్ ఉద్యోగులను, మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను జగన్ వంచించారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమను రతనాల సీమగా మార్చాలని రేయింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే హంద్రీనీవా రెండో దశ పనులు మొదలయ్యాయన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు.

మాగెచెరువు నాకు మెట్టినిల్లు

రాంపురం పుట్టినిల్లయితే… మాగెచెరువు తనకు మెట్టినిల్లు అని మంత్రి సవిత అభిప్రాయపడ్డారు. గడిచిన ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయకపోయినా మాగెచెరువు వాసులు తనకు అత్యధిక మెజార్టీ కట్టబెట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, గ్రామంలో రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించినట్లు వెల్లడించారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని స్పష్టంచేశారు. నూతన సీసీ రోడ్లు, కాలువలతో వాటర్ ట్యాంకు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, నూతన ఇళ్లు అందజేస్తామని మంత్రి సవిత వెల్లడించారు.

చేసిన తప్పులకు శిక్షలు తప్పవు

చట్టవిరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, తప్పులు చేసినా శిక్షలు తప్పవని మంత్రి సవిత ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు తావేలేదన్నారు. జగన్ హయాంలో వైసీపీ మూకలు బరితెగించి, రాజ్యాంగాన్ని అతిక్రమించి దౌర్జన్యాలకు, దారుణాలకు ఒడిగట్టారన్నారు. మహిళలను తమ మాటలతో, చేతలతో వేధింపులకు దిగారన్నారు. వారందరూ ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారని, చట్టం తన పని తాను చేసుకుంటోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును, తనతో సహా మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను, స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు మరెందరో టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధించలేదా…? అని ప్రశ్నించారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

పెనుకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించనున్న ఇండియన్ డిజైన్స్ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారికి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి, రూ.13 వేల జీతంతో పాటు ఇంటెన్సివ్ కూడా ఇస్తారని మంత్రి వెల్లడించారు. యువతతో పాటు మహిళలు కూడా ఈ జాబ్ మేళాను వినియోగించుకోవాలన్నారు.

LEAVE A RESPONSE