– సీఎంఓలోనే అంతా జరిగింది
– గున్నీ అంతా చెప్పారు
– కోర్టులో వాదించిన ప్రభుత్వ న్యాయవాదులు
– నాకేం తెలియదన్న పీఎస్సార్ ఆంజనేయులు
– జెత్వానీ పై అక్రమ కేసు: రాజేంద్రప్రసాద్
– 7 వరకూ రిమాండ్‌కు ఆదేశం
విజయవాడ : నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన మాజీ నిఘా బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులును బుధవారం ఉదయం థర్డ్ ఏసీజేఎమ్ కోర్టులో సీఐడీ పోలీసులు హాజరుపర్చారు. న్యాయమూర్తి ఛాంబర్లో వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట.. లాయర్‌తో కలిసి పీఎస్ఆర్ తన వాదనలు వినిపించార జెత్వానీ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికు వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని వాదించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నిని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో, అప్రూవర్‌గా మారి, ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారని న్యాయమూర్తి ముందు వివరించారు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా, ఇవ్వడానికి ఆయన నిరాకరించారని తెలిపారు. .
‘నేను ఈ కేసులో సహకరిస్తాను అన్నాను. అసలు ఇది తప్పుడు కేసు. నాకు ఈ కేసు విషయంలో సంబంధం లేదు’ అని జడ్జి ముందు పీఎస్ఆర్ వాదించారు. పీఎస్ఆర్ తరపున న్యాయవాది నగేష్ రెడ్డి వాదిస్తూ, కేసులోని టెక్నికల్ డిటైల్స్ వివరించారు. మిగితా నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, అసలు రిమాండ్ విధించాలనే దానికి బేస్ లేదన్నారు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరుతున్నామని న్యాయవాది నగేష్ రెడ్డి వాదించారు.
సీఐడీ తరపున రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే ముంబై నటిపై అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఇదే విషయాన్ని విశాల్ గున్ని కూడా సీఐడీ విచారణలో వెల్లడించారని తెలిపారు. ఆగమేఘాల మీద విశాల్ గున్నిని అప్పటి కమిషనర్ అప్పటి సీఎంవోకు పిలిపించారని వివరించారు.
జెత్వానీ కేసులో ప్రణాళిక అంతా పీఎస్ఆర్ ఆంజనేయులుదే అని విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది సాయి రోహిత్ తెలిపారు. విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్నీని డీఐజీగా ప్రమోషన్ ఇచ్చి వైజాగ్ పంపాలని, అయితే జెత్వనీ కేసు అరెస్ట్‌లు పూర్తి అయ్యాకే పంపుతామని విశాల్ గున్నీని పీఎస్ఆర్ బెదిరించారని తెలిపారు.
విశాల్ గున్నీ, అప్పటి కమిషనర్ కాంతి రాణాను సీఎంఓకు పీఎస్ఆర్ పిలిపించారన్నారు. జెత్వానీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో అనే విషయాన్ని పీఎస్ఆర్కు తెలియజేశామని విశాల్ గున్నీ అంగీకరించినట్లు చెప్పారు. జెత్వానీపై తప్పుడు కేసు పెట్టి 42 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
పీఎస్ఆర్పై గుంటూరు జిల్లా నగరం పాలెంలో కూడా మరో కేసు నమోదు అయింది అని ప్రభుత్వ న్యాయవాది సాయి రోహిత్ వాదనలు వినిపించారు. పీఎస్ఆర్కు వచ్చే నెల 7 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.