– ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘‘ఎమర్జెన్సీకి 50 ఏళ్లు’’ సెమినార్
గుంటూరు: హక్కుల విలువను గుర్తు చేసే ఘట్టంగా ‘అత్యవసర కాలం’ చరిత్రలో నిలిచిపోతుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి. రాజ్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘‘ఎమర్జెన్సీకి 50 ఏళ్లు’’ అంశంపై ప్రత్యేక సెమినార్ జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ 1975లో విధించిన అత్యవసర పరిస్థితి దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా స్వేచ్ఛా హక్కులు నిలిపివేశారని తెలిపారు. ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రాల పరిపాలనా స్వతంత్రత దెబ్బతిందని, ఆర్టికల్ 360తో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని, న్యాయవ్యవస్థపైనా ఆంక్షలు విధించారని గుర్తుచేశారు. ఈ సంఘటనలు నేటి తరం విద్యార్థులకు బోధపడేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సురేష్ మాట్లాడుతూ ‘‘ఎమర్జెన్సీ చరిత్ర కాదు… అది ఓ బోధ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి పౌరుడిలో చైతన్యం అవసరం. ఈ తరానికి అప్పటి పరిస్థితులు తెలియడం, వాటినుంచి పాఠాలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు.
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గోపి మాట్లాడుతూ సామాన్యులపై అరెస్టులు, మీడియా స్వేచ్ఛను అణిచివేత, భయపెట్టే వాతావరణం… ఇవన్నీ ఎమర్జెన్సీ కాలానికి తార్కాణాలన్నారు. అటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఉద్యమాలు నడిపాయన్నారు.
సెమినార్కు అధ్యక్షత వహించిన దాసరి రమాకాంత్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ నేటి విద్యార్థుల జీవితానికి నేరుగా సంబంధం లేకపోయినా, అది వారి భావప్రకటన స్వేచ్ఛకు ఒక బోధక కథగా నిలుస్తుందన్నారు. అప్పటి కాలంలో మాట్లాడే హక్కే లేకుండా పోయిన పరిస్థితులు, నేటి సోషల్ మీడియా వేదికల స్వేచ్ఛకు విలువను వివరంగా తెలియజేస్తాయని చెప్పారు. ప్రభుత్వంపై ప్రశ్నలు వేయడం, సమాజంలో చురుకుగా పాల్గొనడం వంటి అంశాల పట్ల యువతకు స్పష్టత అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విశ్వవిద్యాలయ బృందం, హేమంత్ రామ్, వంశి, రాష్ట్ర బృందం, గంగాధర్, మోహన్, శివ గణేష్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా ఈ సెమినార్ సాగిందని నిర్వాహకులు తెలిపారు.