– స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: వేసవి కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్రామాల్లో మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన ఆర్డబ్ల్యూఎస్, అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.రామస్వామి, డిప్యూటీ ఇంజినీర్ ఎం. జయరామ్‌తో పాటు నాలుగు మండలాలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ మండలాల్లోని ప్రతి గ్రామంలో మంచినీటి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించాలని, తక్షణమే సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి ప్రాధాన్యతననుసరించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
తక్షణ చర్యల ద్వారా వేసవి నాటికి మంచినీటి సమస్యలు తలెత్తకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నుండి అవసరమైన నిధులను తీసుకురావడానికి కలెక్టర్‌తో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. నీటి నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.
సమీక్షలో పాల్గొన్న అధికారులు ప్రతి గ్రామ స్థాయిలో నివేదికలు తయారు చేసి తక్షణమే చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు మండలాల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.