పెద్దపాలపర్రు (ముదినేపల్లి) : పెద్దపాలపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (బ్యాంకు) చైర్మన్గా బొప్పన లక్ష్మి నరసింహారావు శనివారం బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధికి కట్టుబడిన నాయకుడిగా నరసింహారావు ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో నీటి వినియోగదారుల సంఘం (వాటర్ యూజర్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. ఆ హోదాలో ఆయన సాగునీటి సద్వినియోగానికి విశేష కృషిచేశారు. రాజకీయ కుటుంబానికి చెందిన బొప్పన తండ్రి బసవేశ్వరరావు కూడా ఈ సొసైటీ చైర్మన్ గా పనిచేశారు. వీరి తాత శోభనాద్రి మూడు దశాబ్దాలకు పైగా గ్రామ సర్పంచ్ గా విశేష సేవలు అందించారు.
ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ వ్యవసాయదారులకు సకాలంలో రుణసహాయం అందించడమే తన ప్రాథమిక లక్ష్యం అన్నారు. పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముదినేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి ముఖ్య అతిథిగా హాజరు కాగా, గన్నమనేని వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. సొసైటీ డైరెక్టర్ లుగా నియమితులైన పల్లపోతు ప్రసాద్, అడుసుమిల్లి కుశ కుమార్, సీనియర్ నేతలు చిన్నబ్బాయి, మండల యువనేత ఆదిత్య, రాఘవాపురం తెలుగుదేశం నేత ముప్పన ప్రసాద్, కోడూరు దేశం నాయకులు శివాజీ, గ్రామ సర్పంచ్ రాకేష్, పంచాయితీ సభ్యులు నిరంజనరావు, శ్రీనివాస్, దేశం నేతలు ఈదర రాఘవేంద్ర రావు, వేములపల్లి వెంకట నారాయణ (నాని) , చల్లగుళ్ల వెంకటేశ్వర రావు (బుజ్జి) , బీఎల్ నరసింహారావు, సొసైటీ సభ్యులు, బ్యాంకు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.