– సమీకరణకు ఆమోదించిన కేబినెట్
– 9న జరిగిన సమావేశంలో నిర్ణయం
అమరావతి రాజధాని నగర విస్తరణలో భాగంగా రెండో దశ భూ సమీకరణకు ఈ నెలాఖరులోపు 24, 25 తేదీల్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు
జరుగుతున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్లే లోపే దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది.
ఇటీవల జరిగిన సిఆర్డిఏ ఆథారిటీ సమావేశంలో తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. జులై 9వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఆమోదం లభించింది.
ఎపిసిఆర్డిఏ చట్టం సెక్షన్ 55లోని సబ్‌సెక్షన్ 2 ప్రకారం సిఆర్ డి ఏ రీజియన్ పరిధిలో భూ సమీకరణ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో
నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనే తేదీని ఖరారు చేయలేదు. దీంతో పూలింగు జరుగుతుందా లేదా అనే అంశంపై గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఈనెలాఖరులోపే పూలింగు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ల నియామక ప్రక్రియను వేగవంతం చేశారు.
బుధవారం ఢిల్లీలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద సిఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన చర్చల్లో ఆర్థికాంశాలపై కొంత స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సమీకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
సింగపూర్ పర్యటనలో ప్లానింగే కీలకం
ఈనెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టి.జి.భరత్, అధికారులు కాటంనేని భాస్కర్, యువరాజు, కార్తికేయ మిశ్రాతోపాటు, ఎకనామిక్ డెవలప్మెంట్ సిఇఓ సాయికాంత్ వర్మ, సిఆర్డిడి ఏ కమిషనర్ కె. కన్నబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈనెల 13వ తేదీన ప్రభుత్వం జిఓ 120 విడుదల చేసింది. ఈ పర్యటనలో అర్బన్ ప్లానింగు,
బ్యూటీఫికేషన్, గార్డెనింగ్, పోర్టులపై చర్చ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి ప్లానింగు ఆంశంపైనే సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్రం చర్చలు. జరుపుతోంది. సానుకూల వాతావరణం రావడంతోనే బృందం అక్కడకు బయలుదేరింది.
అక్కడ చర్చించే అంశాల్లో అమరావతి ప్లానింగే కీలకంగా ఉంటుందని పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత పూలింగుకు సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీయే ప్లానింగు ఇచ్చింది. కొత్తగా సమీకరణకు వెళ్లే ప్రాంతంలో ప్లానింగు చేయాలంటే చట్టపరంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.లేనిపక్షంలో సింగపూర్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించదు. ఈ నేపథ్యంలోసింగపూర్ వెళ్లేలోపే దీనికి తగిన విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
విజయవాడ
9010099208