– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటు విమర్శ
విజయవాడ: టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు పేరుకే. వీళ్ళంతా బీజేపీకి బానిసలే. రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. స్వప్రయోజలే వీరికి మిన్న. రాష్ట్ర హక్కుల కన్నా.. మోడీ మెప్పు మిన్న అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ విభజన హామీలపై లేదు. తమ నోరును హక్కుల కోసం కాకుండా మోడీ జపానికి మాత్రమే వాడతారు. నమ్మి ఓటేస్తే మతపిచ్చి పార్టీకి ఊడిగం తప్పా ఉద్ధరించింది శూన్యం.
మోడీ చేతిలో 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు రబ్బర్ స్టాంప్స్. బీజేపీ కోసం పని చేసే కీలుబొమ్మలు. హోదాపై అడిగే దమ్ములేదు. రాజధానికి నిధులు అడిగే సత్తా లేదు. పోలవరాన్ని ముంచుతుంటే ఎదురు తిరిగే ధైర్యం లేదు. అడ్డికి పావుసేరు కింద విశాఖ స్టీల్ ను అమ్ముతున్నా.. పౌరుషం ఉండదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులపై గళం విప్పకుండా.. బీజేపీ అక్రమ బిల్లులకు గొర్రెల్ల తల ఊపడం తప్పా మన ఎంపీలకు ఏమి చేతకాదు. రాష్ట్ర ఎంపీలకు దమ్ము, ధైర్యం, పౌరుషం అనేది ఉంటే.. ఈ రాష్ట్ర బిడ్డలే అయితే.. మీలో పారుతుంది చీము నెత్తురే అయితే.. మోడీ తొత్తులు కాదనుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే మీకు ముఖ్యం అనుకుంటే.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కులపై నిలదీయండి.
మోడీ మోసాన్ని ప్రశ్నించండి. విభజన హామీలపై నోరు విప్పండి. తిరుపతి వేదికగా ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఏమయ్యిందని అడగండి. హోదాపై తాడోపేడో తేల్చండి. ఢిల్లీని తలదన్నే రాజధాని ఏదని అడగండి. కేంద్రం బాధ్యతగా అమరావతికి నిధులు కాకుండా అప్పులు ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పమనండి. జీవనాడి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు కుదించి ఎందుకు జీవం తీశారని ఉభయ సభలను స్తంభింపజేయండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉండదని మోడీ చేత అధికారిక ప్రకటన చేయించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.