– మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు: విద్యుత్ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నగర పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో రూ.4.50 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద రూ. 11 కోట్లతో చేపడుతున్న వివిధ విద్యుత్ పనులకు భూమిపూజ, భాగ్యనగర్ లో రూ. 4.50 కోట్లతో నిర్మించనున్న సబ్ స్టేషన్ పనులకు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎమ్మెల్యే బిన్ విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
నిరంతర త్రీ ఫేస్ విద్యుత్ సరఫరాతో ఒంగోలు నగర పరిధిలో అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావడం, లోవోల్టేజీ కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితులు తలెత్తవన్నారు. దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ పూర్తయితే సమీపంలో ఉన్న ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
నగరపరిధిలోని గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తుందని, ప్రజలకు, రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. కేవలం రైతులకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అన్సారీయా, శాసన సభ్యుడు బీన్ విజయ్ కుమార్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.