– వైద్య దంపతులను అభినందించిన కేటీఆర్
– కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి సుస్మిత తల్లిదండ్రులు
హైదరాబాద్: తన జన్మదిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు నిర్వహిస్తున్న “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం మరోసారి మానవతా విలువలను చాటిచెప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, వెంకటాపూర్ కు చెందిన సుస్మిత, హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుంది.
అయితే పేద కుటుంబానికి చెందిన సుస్మిత తన చదువు కోసం ఆర్ధిక సాయం చేయాలని ట్విట్టర్ (X)వేదికగా కేటీఆర్ ని కోరింది. సుస్మిత విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్… సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు నిర్వహించే “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం స్పూర్తితో ప్రసిద్ధ న్యూరో ఫిజిషియన్ డా. చంద్ర శేఖర్ పాఠకోటి (MD/DM), ఆయన భార్య డా. ప్రణయ వాణి లు సుస్మిత చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని ప్రకటించారు.
ఇవాళ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దుబ్బాక మండలం రాజక్కపేట చెందిన డా. చంద్రశేఖర్ ప్రస్తుతం ముషీరాబాద్ కేర్ హాస్పిటల్, నాచారంలోని శ్రీపూజా హాస్పిటల్లలో వైద్య సేవలందిస్తున్నారు.
ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ న కలిసిన వైద్య విద్యార్థి సుస్మిత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య దంపతులను అభినందించిన కేటీఆర్ వారిని శాలువాతో సత్కరించారు.