– సిట్, ఇడి సంస్ధల దర్యాప్తు జగన్ కు అతి సమీపంలోకి వచ్చినట్టే
(నవీన్)
“వుయ్ స్టాండ్ విత్ మిథున్ అన్న” హాష్ టాగ్ తో సోషల్ మీడియా ద్వారా మిధున్ రెడ్డి కి మద్దతు కూడగట్టే పని మొదలు పెట్టినా, జగన్ స్వయంగా ఇది రాజకీయకుట్ర కక్ష అని వాదించినా లిక్కర్ స్కామ్ డిజైనర్, రాజంపేట ఎంపి అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది.
మిధున్ రెడ్డి అరెస్ట్ కేవలం చట్టాన్ని అమలు చేసే చర్య మాత్రమే కాదు. ఆచరణలో ఇది “పెద్దిరెడ్డి” కుటుంబ ఆధిక్యతపై ఒక వేటు వేసినట్టు అయింది. రాయలసీమలో అత్యంత పలుకుబడి ఉన్న కుటుంబాల్లో వై ఎస్ కుటుంబం ఒకటి.
జగన్ చిన్నప్పటి నుంచీ పులివెందులకు దూరంగా హైదరాబాద్, బెంగుళూరుల్లో ఉండటం, రాజశేఖరరెడ్డి మరణం, వివేకానందరెడ్డి హత్య, జగన్ కు తల్లితో, చెల్లితో తగాదాలు రోడ్డున పడటం మొదలైన పరిణామాల్లో జగన్ కు సీమగడ్డతో వేర్లు దాదాపు తెగిపోయాయి. అవినాష్ రెడ్డి కుటుంబం అక్కడ జగన్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది.
అయితే సీమలో “పెద్దిరెడ్డి” కుటుంబానికి వున్న ప్రాబల్యానికంటే జగన్ ప్రాబల్యం తక్కువే! తమప్రాంతం గుండా వెళ్తున్న తెలుగుదేశం అభిమానుల సైకిళ్ళు విరిచేసి చెప్పులు బట్టలు విప్పించిన భూస్వామ్య గూండాయిజం పెద్దిరెడ్డి కుటుంబానిది. నాయకులతో కలవడానికి ఇష్టపడని జగన్ కోటరీలో మిధున్ రెడ్డి ముఖ్యుడయ్యారు.
ఈ నేపథ్యంలో మిధున్ రెడ్డి అరెస్ట్ సీమప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని పగలగొట్టినట్టయింది. జగన్ ను వెనకేసుకు రావడమా? సొంత నేలమీద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమా అనే సమస్య ఎదురయ్యే పక్షంలో.. పెద్దిరెడ్డి కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటారో ఇప్పటికైతే వారికే తెలియదు.
అతిముఖ్యుడైన మిధున్ రెడ్డి జైలుకి వెళ్ళాక ఆ పార్టీని జగన్ కాపాడుకోగలరా అనే ప్రశ్న పెద్దదైతే చాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తటస్ధులైపోతారు.
పార్టీనిర్మాణం నాయకులతో నిరంతర సంబంధాలు మొదలైన వ్యవస్థాగత కార్యక్రమాల మీద జగన్ కు ఆసక్తి లేదు.
జగన్ బ్రాండ్ వల్లా, సొంత కృషివల్లా గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో బొత్స సీనియర్ నాయకుడు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో లాంఛనంగా కనిపిస్తున్నారు. పార్టీని వెనకేసుకు రావలసిన సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా మొక్కుబడి వ్యవహారంగానే అర్ధమౌతోంది.
మిధున్ రెడ్డిని సెంట్రల్ జైలుకి తరలించిన సందర్భంగా రాజమండ్రిలో ఆయన పార్టీనాయకులు కార్యకర్తలు జైలువద్దకు చేరి నినాదాలు చేశారు. మిధున్ రెడ్డి పార్టీకి తూర్పుగోదావరి ఇన్ చార్జ్ గా వున్నారు. జైలువద్ద నాయకుల “అటెండెన్స్” “చంద్రబాబు ప్రభుత్వం పై “లాంఛన పూర్వకమైన” విమర్శలు బాగానే వున్నాయి. అయితే చంద్రబాబు అరెస్టయినప్పటి మాదిరిగా కార్యకర్తల సానుభూతి ఆగ్రహాలు లేవు.
ఏమైనా, మిధున్ రెడ్డి రిమాండ్ కు వెళ్ళడం అంటే సిట్, ఇడి సంస్ధల దర్యాప్తు జగన్ కు అతి సమీపంలోకి వచ్చినట్టే! ఈ స్థితిలో కోటరీ జైలు గండంతో, నాయకులు భవిష్యత్తుపై లెక్కలు వేసుకోవడంలో నిమగ్నమై ఉండగా, జగన్ మాత్రమే ఆ పార్టీలో పెద్ద క్రౌడ్ పుల్లర్. ఆయనకే కదల్లేని పరిస్ధితి వస్తే అభిమానులు, సానుభూతిపరుల ఆందోళనలను ఆర్గనైజ్ చేసే నాయకులు పార్టీలో కనిపించడం లేదు.
చంద్రబాబుని జైలుకి పంపినపుడు కేసు పూర్వాపరాలతో నిమిత్తం లేకుండా.. ఆయ్యో పెద్దాయనకి ఈ కష్టమా అన్న సానుభూతి ప్రజల్లో కనబడింది. 3500 కోట్ల లిక్కర్ స్కామ్ లో దొరికిపోయిన మిధున్ రెడ్డి విషయంలో ఎక్కడా సానుభూతి లేదు. ఉండబోదని ఆ పార్టీకి కూడా తెలుసు.