– నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపణ
తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అడుగడుగునా అరాచకం పెచ్చు మీరుతోందని.. ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆయన తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ తీరు ఆక్షేపణీయమన్న ఆయన, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా ఏఎస్పీనే బెదిరించడం అత్యంత దారుణమని అన్నారు. అందుకు తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నానాటికీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విచక్షణ మర్చిపోయి తీవ్రంగా దుర్భాషలాడుతున్నారు. మొన్నటికి మొన్న జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడుని దుర్భాషలాడిన విషయం మరువక మందే మరోసారి ఆలిండియా లెవెల్ అధికారి, తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మీద ఆయన నోరు పారేసుకున్నారు. తాను చెప్పినట్లు వినడం లేదన్న అక్కసుతో ఇటీవలే జిల్లాస్థాయి అధికారిని దూషించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇప్పుడు ఏకంగా జిల్లా స్దాయి అధికారిని ఒరేయ్ అని సంభోదించం అత్యంత దుర్మార్గం. ఉద్యోగులు మీ కాళ్ల దగ్గర పని చేసే జీతగాళ్లు కాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పని చేసే అధికారులు రాజ్యంగం ప్రకారం నియమ నిబంధనలను అనుసరించి పని చేస్తారు తప్ప, మీకు నచ్చినట్లు మీ సొంత రాజ్యాంగం ప్రకారం పని చేయరన్న విషయం గుర్తుంచుకోవాలి.