– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ
విజయవాడ: మహాశక్తి పథకంపై కూటమి ప్రభుత్వం ఇక చేతులెత్తేసినట్లే. పథకాన్ని బంగాళాఖాతంలో కలిపినట్లే. సూపర్ సిక్స్ లో ఒక సిక్స్ కి ముగింపు పెట్టినట్లేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహాశక్తి పథకంపై ఇవ్వాళ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు హాస్యాస్పదం. మంచి ప్రభుత్వం అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వానికి ఇది నిజంగా సిగ్గుచేటు అని ఆమె విమర్శించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే… మంచి ముసుగులో మహిళలను ముంచుతున్నారు. ఆ మధ్య సీఎం చంద్రబాబు ఏమో పథకాన్ని పీ4 లో కలిపామని, అమలు చేసేశామని అబద్ధాలు చెప్తారు.
సూపర్ సిక్స్ ఎక్కడ అని అడిగే వాళ్ళ నాలుక మందం అంటారు. ఇవ్వాళ బాబు గారి మంత్రిగారేమో మహాశక్తి కోసం ఆంధ్రాను అమ్మాలి అంటారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాదు అంటారు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం.. మహిళలకు నెలకు 15 వందలు ఇస్తామని హామీ ఇచ్చే ముందు తెలియదా ఆంధ్రాను అమ్మాలని? సూపర్ సిక్స్ లో హామీల్లో పెట్టి మహిళల ఓట్లు దండుకొనే ముందు తెలియదా ఈ పథకం ఆర్థిక భారం అని? ఆర్థిక అంచనా లేకుండానే గుడ్డిగా వేల కోట్ల హామీ ఇచ్చారా? ఆడబిడ్డ కష్టాలు నేరుగా చూశామని మోసం చేయడమేనా మీరిచ్చే మహిళా సంక్షేమం? ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలి.