– ‘చాగల్నాడు’ నుంచి సాగునీరు విడుదల చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
కాతేరు: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం ఉదయం కాతేరు గ్రామ పరిధిలోని చాగల్నాడు ఎత్తిపోతల పథకానికి రాజమహేంద్రవరం గ్రామీణ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి శాసన సభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం శాసన సభ్యుడు బత్తుల బలరామకృష్ణ తో కలిసి మొదటి దశ సాగునీటిని విడుదల చేశారు. తొలుత గోదావరి నదికి హారతి నిచ్చి, అనంతరం మోటారు స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలలోని రంగంపేట, కోరుకొండ, రాజానగరం మండలాలలో గల 6,250 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. చాగల్నాడు మొదటి దశ నుంచి లీడింగ్ ఛానల్ ద్వారా కోలమూరు లో గల రెండవ దశకు అక్కడి నుంచి మరో లీడింగ్ ఛానల్ ద్వారా పాలచర్ల లోని మూడో దశకు అక్కడి నుంచి కాలువ ద్వారా పొలాలకు సాగు నీరు చేరుతుందని తెలిపారు.
చాగల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి దశలో ప్రస్తుతానికి ఒక పంపు మాత్రమే పనిచేస్తోందని, మిగిలిన వాటికి మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వొచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు (ఈ. ఈ) కె. వెంకటేశ్వర రావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (డి. ఈ) పి. పురుషోత్తం దొర, సహాయ కార్యనిర్వాక ఇంజనీరు (ఏ. ఈ) పి.సత్యనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, జల వనరుల శాఖ సిబ్బంది, రైతులు , స్థానికులు తదితరులు పాల్గొన్నారు.