(చాకిరేవు)
ఐపీఎస్ సంజయ్ ముందస్తు బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే బెయిల్ల విషయంలో సోషల్ మీడియాలో చర్చకు స్పందనగా అన్నట్లు, హైకోర్టులో సారీ టు ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వాఖ్యానించిన జడ్జీగారు ఇచ్చిన 49 పేజీల ముందస్తు బెయిల్ తీర్పుపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు.
అగ్నిమాపక దళం డీజీగా ఉన్న సంజయ్, అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. హైకోర్టు బెయిల్ తీర్పును పరిశీలించిన సుప్రీంకోర్టు, అసలు ఇది ముందస్తు బెయిల్ విచారణలా కాకుండా, “ఏపీ హైకోర్టు కేసు విచారణ జరిపినట్లు ఉంది,
” “మినీ ట్రయల్ జరిగినట్లుగా ఉంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ స్థాయిలో తీర్పు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాధారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్లలో కేసు వివరాల్లోకి ఇంత లోతుగా వెళ్లరని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఒప్పంద పత్రాలు, ఇన్వాయిస్లు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు, న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అసంతృప్తితో.. ఇది రాష్ట్రంలోని న్యాయ, పాలనా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఐపీఎస్ సంజయ్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది ఈ నెల 30న జరిగే విచారణలో తేలిపోనుంది.
ఒక ముందస్తు బెయిల్ కేసులో 49 పేజీల తీర్పు, మినీ ట్రయల్ జరిగినట్లుగా ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర న్యాయవ్యవస్థ పనితీరుపై ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి? ఇది రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు నుండి వచ్చిన హెచ్చరికా అనే చర్చకు దారితీస్తోంది.