– ఆడబిడ్డనిధిపై నోరుజారిన అచ్చెన్న
– ఆ పథకం అమలుచేస్తే ఆంధ్రాను అమ్మేయాలంటూ వ్యాఖ్యలు
– అచ్చెన్న వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్న వైసీపీ మహిళా నేతలు
– అవి చంద్రబాబు వ్యాఖ్యలేనంటూ విమర్శల వర్షం
– ఆడబిడ్డనిధి పథకం ఎగ్గొట్టేందుకేనంటూ ఆరోపణలు
– వైసీపీకి అస్త్రాలివ్వడంపై తమ్ముళ్ల ఆగ్రహం
– ఎన్నికల ముందు ‘పార్టీలేదు బొక్కలేద’న్న వ్యాఖ్యల వీడియో హల్చల్
– అప్పుడే క్రమశిక్షణ కమిటీ పిలిపిస్తే సరిపోయేదన్న వ్యాఖ్యలు
– గతంలో కొలికపూడిని పిలిపించిన క్రమశిక్షణ కమిటీ
– ఇప్పుడైనా అచ్చెన్నను పిలిపించి వివరణ తీసుకుంటే బాగుంటుందని వాదన
– చంద్రబాబు కష్టం ఇలా వృధా అవుతుందంటూ సీనియర్ల ఆవేదన
– కేంద్ర నిధుల కోసం బాబు, లోకేష్ తంటాలు
– అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నకు ఆ మాత్రం తెలియదా అంటూ ఆక్షేపణలు
-పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేశారంటూ ఆవేదన
( మార్తి సుబ్రహ్మణ్యం)
కింజరాపు అచ్చెన్నాయుడు. టీడీపీ సీనియర్ నేత. గొంతున్న నేత. గత అసెంబ్లీలో జగన్‌ను ఎదుర్కొన్న నాయకుడు. అంతేకాదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవశాలి. మరి అంత అనుభవం ఉన్న నాయకుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఎంత ఆచుతూచి పెదవి విప్పాలి? కానీ అందుకు భిన్నంగా ఇప్పటికి రెండుసార్లు అచ్చెన్న జారిన నోరు వైసీపీకి బ్రహ్మాస్త్రాలుగా మారాయి. గతానుభవం గమన ం లోకి తీసుకోకుండా, రెండోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రతిష్ఠ పెంచుతున్న హామీలపై అనుమానపు మేఘాలు కమ్మేలా చేశాయి. అసలు..గత ఎన్నికల్లో కూటమికి మహిళాలోకం ఓట్లు కురిపించిన ‘ఆడబిడ్డనిధి’ పథకం అమలు అసాధ్యమన్న అనుమానపు బీజాలను, మహిళాలోకంలో వేసేందుకు కారణమయ్యాయి. ఫలితంగా అచ్చెన్న వ్యాఖ్యలు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారాయి. ఫలితంగా కూటమికి ఆత్మరక్షణ!
దశాబ్దాల నుంచి శ్రీకాకుళం జిల్లాను తన కనుసన్నలతో శాసిస్తున్న వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు, టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారాయి. దానితో రంగంలోకి దిగిన వైసీపీ మహిళా నేతలు.. ఆ పథకం అమలుచేసే ఆలోచన కూటమి సర్కారుకు లేదని అచ్చెన్న వ్యాఖ్యలు నిరూపించాయని, అసలు చంద్రబాబు నాయుడే ఆయనతో అలా చెప్పించారన్న కొత్త భాష్యంతో యాగీ చేయడం ప్రారంభించడం కూటమిని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.
అసలే పార్టీ నేతలపై కేసులు, అగ్రనేతల అరెస్టులతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి అచ్చెన్న వ్యాఖ్యలు ఊపిరిపోసినట్టయింది. దానితో కేవలం మహిళా నేతలనే రంగంలోకి దింపిన వైసీపీ వ్యూహం వర్కవుటయింది. నిజానికి వారు కూడా మర్చిపోయిన ఆడబిడ్డ పథకం అమలు విషయాన్ని.. స్వయంగా అచ్చెన్న వ్యాఖ్యలు వారికి గుర్తు చేసినట్టయింది. రాష్ట్రంలోని తమ పార్టీ మహిళా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నాయలతో విలేకరుల సమావేశాలు పెట్టించి.. అచ్చెన్న వ్యాఖ్యలు కూటమి ఉద్దేశాన్ని స్పష్టం చేసినందున, మహిళలు టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునివ్వడం ప్రస్తావనార్హం.
కూటమి ప్రభుత్వానికి ఆడబిడ్డ పథకం అమలు చేయడం ఇష్టం లేదని, దానిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోందనడానికి అచ్చెన్న వ్యాఖ్యలే నిదర్శమని విరుచుకుపడ్డారు. ఆ మేరకు ఆడబిడ్డ పథకానికి సంబంధించిన వివరాలను, అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపించింది. దానిని బట్టీ పట్టిన వైసీపీ మహిళా నేతలు.. అచ్చెన్న భుజం నుంచి తుపాకీ పెట్టి కూటమిపై గురిపెట్టారు.
దీనితో టీడీపీ శిబిరం నుంచి ఎదురుదాడి కరువయిపోయింది. చివరకు టీడీపీ మహిళా నేతలు కూడా అచ్చెన్న వ్యాఖ్యలను సమర్ధించకపోవడం ఒక టయితే, వైసీపీ ఆరోపణలను ఖండించలేకపోవడం మరో విషయం. ఆ స్థాయిలో అచ్చెన్న వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందికి గురిచేసినట్లు స్పష్టమవుతూనే ఉంది.
నిజానికి పార్టీ సీనియర్ నాయకుడయిన అచ్చెన్నాయుడు ఇలా నోరు జారి, పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేయడం ఇది రెండోసారి. గత ఎన్నికల ముందు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నాయకుడితో ‘‘పార్టీలేదు బొక్కలేదు. గట్టి పెరుగు వెయ్’’అంటూ చేసిన వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో వైరల్ అయి, అప్పటికే జగన్ సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేసిన పార్టీని ఇబ్బందిపెట్టాయి.
దానిని తనకు అనుకూలంగా మలచుకున్న వైసీపీ… ‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చెబుతుంటే మాకు ఓట్లేయమని కోరుతున్న చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారు? సొంత పార్టీ అధ్యక్షుడికే గెలుపుపై లేని నమ్మకం ప్రజలకు ఎలా ఉంటుంది’’ అంటూ అచ్చెన్న వ్యాఖ్యలను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు.
పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అచ్చెన్న గతంలో పార్టీలేదు.బొక్కలేదు. గట్టిపెరుగువెయ్యమన్న వీడియో బయటకు వచ్చి, పార్టీని ఇబ్బందిపెట్టినప్పుడే ఆయనను క్రమశిక్షణ కమిటీ పిలిపించి, వివరణ కోరితే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.
‘‘ కింజారపు కుటుంబానికి పార్టీ ఎంతో మేలు చేసింది. ఎన్నో పదవులిచ్చింది. ఇంకా ఇస్తూనే ఉంది. ఉత్తరాంధ్రలో బాబాయ్ అబ్బాయిలదే హవా. పార్టీ వారికి ఆ స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది. అసలు అన్నగారు పార్టీ పెట్టిందే కింజారపు, యనమల కుటుంబం కోసం అన్నంత స్థాయిలో ఆ కుటుంబాలు పదవులు అనుభవించి, ఇప్పుడు ఇలా పార్టీని ఇబ్బందిపెట్టేలా మాట్లాడటం, ఏమీ అనకుండా మౌనంగా ఉండటం పార్టీకే చెల్లింది. అదే అచ్చెన్న స్థానంలో మరొకరు ఉంటే క్రమశిక్షణ కమిటీ మౌనంగా ఉండేదా? గతంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును క్రమశిక్షణ కమిటీ ముందు పిలవలేదా? ఇప్పుడు అచ్చెన్నను కూడా పిలిపించి వివరణ కోరితే, భవిష్యత్తులో మిగిలిన వారు ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్లకు చెప్పేదెవరు’’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే వాపోయారు.
ఇప్పుడు అచ్చెన్న చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆడబిడ్డ పథకం అమలుచేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘చంద్రబాబు, లోకేష్‌బాబు ఇద్దరూ కేంద్రం చుట్టూ తమ పలుకుబడి ఉపయోగించి నిధులు తీసుకువస్తున్నారు. మనకు ఎంపిల బలం ఉండబట్టి వాళ్లు కూడా మన మాట గౌరవించి నిధులు సర్దుబాటు చేస్తున్నారు. దానికోసం చంద్రబాబు-లోకేష్ పడుతున్న ఇబ్బందులు జనాలకు తెలియకపోయినా సీనియర్ అయిన అచ్చెన్నకు తెలియాలి కదా? మధ్యలో పవన్‌కల్యాణ్ కూడా, జగన్ హయాంలో వెనక్కివెళ్లిపోయిన జల్‌శక్తి నిధులను తిరిగి తెప్పించడానికి చాలా కష్టపడాలి వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అచ్చెన్న వంటి సీనియర్లు సహకరించపోయినా మౌనంగా ఉండాల్సింది పోయి, అసలు పథకం అమలుపైనే అనుమానాలు వచ్చేలా మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్? ఆడబిడ్డ పథకం త్వరలోనే అమలవుతుందని మహిళలకు చెప్పవచ్చు. హామీల అమలుకోసం కొత్త పన్నులు వేయకుండా చంద్రబాబు ఒక్కొక్కటీ అమలుచేస్తున్నారనీ చెప్పవచ్చు. వాళ్లేమీ మనల్ని ఆ పథకం ఎప్పటినుంచి అమలుచేస్తారని డేట్లేమీ అడగరు కదా? ఆ మాత్రం స్పృహ లేకుండా మాట్లాడితే ఎలా? ఇప్పుడు వైసీపీ వాళ్ల దాడికి మనం ఎలా ఎదురుదాడి చేస్తాం? ఎప్పటినుంచి అమలుచేస్తామని చెబుతా’’మని మరో సీనియర్ నేత విశ్లేషించారు.
ఇవన్నీ నిధుల కోసం చంద్రబాబునాయుడు పడుతున్న కష్టాన్ని బూడి దలో పోసిన పన్నీరును చేస్తున్నాయని, ఇలాంటి పరిణామాలపై ఇకనయినా నిర్మొహమాటంగా వ్యవహరించకపోతే, ఆత్మరక్షణలో పడటం పార్టీకి అలవాటయిపోతుందని ఓ మాజీ మంత్రి స్పష్టం చేశారు.