– మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృషితో ఏవియేషన్ రంగంలో కీలక పెట్టుబడులు
– రాష్ట్రానికి రానున్న 9 ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, 2 ప్లైట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు
అమరావతి: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ “ఏవియేషన్ హాబ్” గా మారబోతుందని.. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని ఆర్ అండ్ బి శాఖా కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పలువురు పెట్టుబడుదారులు, పారిశ్రామికవేత్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు సంస్థలు తమ ఆసక్తిని మంత్రికి తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో గతేడాది కాలంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడిందని.. దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతుందని తెలిపారు. ముఖ్యంగా నేడు దేశంలో ప్రముఖ ఏవియేషన్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నేడు ఆయా ఏవియేషన్ సంస్థల ప్రతినిధులతో మంత్రి జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఏవియేషన్ సంస్థలు సుముఖత తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంస్థల ఆలోచనలు, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన సమగ్ర నివేదికను మంత్రికి అందజేశాయి. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే, రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని ఆ సంస్థ ప్రతినిథులకు మంత్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రానికి క్యూ కడుతున్న ఏవియేషన్ రంగంలో అగ్రగామి సంస్థలు
ఏవియేషన్ రంగంలో అపార అనుభవం ఉన్న ఇటువంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం నిజంగానే ఆంధ్రప్రదేశ్ కు శుభపరిణామమన్నారు.. ఇప్పటికే ఈప్లెన్ కంపెనీ, బ్లూజే ఏవియేషన్, మాగ్నమ్ వింగ్స్, సరళ ఏవియేషన్ సంస్థ, గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ సంస్థ, హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ ఏవిటాల్ సంస్థలు… మంత్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబర్చడమే కాదు, గతంలో మంత్రిని స్వయంగా కలిసి వారి ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలు తెలిపాయి.
ఈ క్రమంలో నేడు తాజాగా రాష్ట్రంలో స్కై బర్డ్ ఏవియేషన్ ప్రవేట్ లిమిటెడ్, పెలిక్సీ ఏవియేషన్ అకాడమీ, ఎఫ్ టీ ఓ & హెలీ టాక్సీ సర్వీసెస్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ పరిణామని మంత్రి పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో 9 ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ సంస్థలు, 2 ప్లైట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, 5 ఈవీ టోల్స్ కంపెనీలు, 2 ఎమ్ ఆర్ ఓ, 3 సిమ్యులేషన్స్ సెంటర్లు రానున్నాయని తెలిపారు.