– కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రాలో కలపడమే – చివరకు కేటీఆర్ బర్త్ డే వేడుకలపైనా విషం కక్కిన సీఎం రేవంత్
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్: కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’రామారావు అని, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా స్వరాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర నుంచి, ప్రజల మదిలో పదిలపర్చుకున్న పదేళ్ల సుపరిపాలనా ప్రస్థానం నుంచి కేటీఆర్ ఆనవాళ్లను చెరిపేయలేరని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అధికారమదంతో ప్రభుత్వ పెద్దలు హైడ్రాను అడ్డం పెట్టుకొని కేటీఆర్ ప్లెక్సీలు తొలగించ గలరేమో కానీ జనం గుండెల్లో గూడుకట్టు కున్న ఆయన పేరును చెరిపేయలేరని స్పష్టం చేశారు.
కేటీఆర్ సుదీర్ఘకాలం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో దేశ, విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందాయని, తన పనితీరుతో జాతీయ, అంతర్జాతీయ ఇమేజ్ను తెచ్చారనటంలో అతిశయోక్తి లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో, హైదరాబాద్ అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలను స్థాపించడంలో కేటీఆర్ చేసిన కృషి, టీ-హబ్, వీ-హబ్, టీ-వర్స్ వంటి వినూత్న కార్యక్రమ స్టార్టప్‌ల సృష్టిలో అనుసరించిన వైఖరిని పలు సందర్భాల్లో కొనియాడిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కేటీఆర్‌ను ఐకానిక్‌గా అభివర్ణించాయన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రాలో కలపడమేనని, ఆయన కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆయన నెలకొల్పిన 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టడమేనని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేటీఆర్ బర్త్ డే వేడుకలపైనా విషం కక్కిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించే చిల్లర పనికి ఒడిగట్టారని ఆయన ధ్వజమెత్తారు. హైడ్రాను ఆదేశించి నగరంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపి వేయించారని ఆయన చెప్పారు. కానీ వాటి పక్కనే ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోస్టర్లను మాత్రం వదిలేశారనీ, బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను అసలు ముట్టు కోలేదని ఆయన పేర్కొంటూ, కేటీ ఆర్ ఫ్లెక్సీలపై హైడ్రా అధికారుల తీరును ఖండించారు.