– సింగపూర్ చట్టాల గురించి చెపుతూ 30 ఏళ్ల క్రితం నాటి గతాన్ని సరదాగా గుర్తు చేసుకున్న చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అక్కడ జరిగిన తెలుగు ప్రజల సమావేశంలో ఆసక్తికర గతాన్ని గుర్తుచేసుకున్నారు. సింగపూర్ చట్టాలు, ఇక్కడి పాలకుల గొప్పదనం గురించి చెపుతూ….ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటనను చంద్రబాబు సరదాగా ప్రస్తావించారు. తాను రెండో సారి సిఎం అయినప్పటినుంచి సింగపూర్ వస్తున్నానని తెలిపిన చంద్రబాబు…ఇక్కడ చట్టాలు, పాలకుల ఆలోచనలు తనను ఎంతగానో ఆకట్టుకునేవన్నారు.
ఇక్కడ పాలసీలను, కఠిన చట్టాలను చూసి వాటిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసే ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. సింగపూర్ ఎంత గొప్పదంటే….ఎప్పుడూ సిగిరెట్ తాగే అశోక్ గజపతి రాజు లాంటి వారు కూడా ఇక్కడ చట్టాలకు భయపడి నాడు సింగపూర్ వచ్చినప్పుడు సిగరెట్ వెలిగించలేదని నవ్వుతూ గతాన్ని గుర్తు చేశారు. రెండో సారి సిఎంగా ఉన్న సమయంలో తాను మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి సింగపూర్ వచ్చానని…ఎప్పుడూ సిగరెట్ వద్దన్నా వినని ఆశోక్ గజపతి రాజు….అప్పుడు సింగపూర్ లో మాత్రం ఎక్కడా సిగరెట్ ముట్టుకోలేదని అన్నారు.
సింగపూర్ లో చట్టాలు కఠినంగా ఉంటాయని…ఒక్కడ బహిరంగంగా సిగరెట్ తాగితే 500 డాలర్లు ఫైన్ వేస్తారని….నేను తెచ్చుకుందే 500 డాలర్లు…ఒక్క సిగరెట్ కు అంత సొమ్ము పెడితే మిగిలిన రోజుల్లో ఖర్చులకు డబ్బులు ఎలా అని ఆశోక్ గజపతి రాజు సింగపూర్ లో ఉన్నన్ని రోజులు సిగరెట్ తాగలేదని గుర్తు చేశారు. అలా చట్టాలను అమలు చేయడంలో ఎంతో మంచి పేరున్న, అవినీతికి ఆస్కారం లేని సింగపూర్ అంటే తనకుఎంతో అభిమానమని నాటి ఘటనను నవ్వుతూ చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
– రైతుబిడ్డ