– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశా
– తెలంగాణలో అడ్వకేట్లపై దాడులు
– 256 మంది అడ్వకేట్లు ఎంపీలుగా ఉన్నారు
– తెలంగాణ ఉద్యమంలోనూ అడ్వకేట్ల పాత్ర మరువలేనిది
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా కొత్తగూడెం కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు
కొత్తగూడెం: ప్రస్తుతం తెలంగాణలో అడ్వకేట్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ అంశంపై నేను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశాను. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరం. నేను ఇక్కడకు వచ్చినప్పుడు నల్లకోటే గుర్తుండిపోతుంది. రాజకీయ పార్టీల గురించి ఆలోచించను. ఇది మనకు న్యాయ దేవాలయం లాంటిది.
నేను శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అన్ని కోర్టులకు సరైన భవనాలు లేవని గుర్తించి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త కోర్టు భవనాల కోసం డిమాండ్ చేశాను. న్యాయవాదుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు కదా… ఆ నిధులు ఎక్కడకు పోయాయనే విషయంపై ప్రశ్నించాం.
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఈ విషయంపై గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశాను. ఈ చట్టం తప్పకుండా అమలవుతుందని నమ్ముతున్నాను.
స్వాతంత్ర్య ఉద్యమంలో అడ్వకేట్ల భాగస్వామ్యం లేకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యం మరింత ఆలస్యమయ్యేది. అలాగే తెలంగాణ ఉద్యమంలోనూ అడ్వకేట్ల పాత్ర మరువలేనిది.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, డబ్బున్నవారు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. కానీ రాజకీయాల్లోకి మంచి ప్రజోపయోగమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న మంచి వ్యక్తులు రావాలి. ప్రస్తుతం పార్లమెంట్లో 256 మంది అడ్వకేట్లు ఎంపీలుగా ఉన్నారు.
నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓటు కొనుగోలు చేయనని స్పష్టంగా చెప్పాను. మన రాజ్యాంగాన్ని మనమే పరిరక్షించుకోవాలి. అడ్వకేట్లు అన్ని సబ్జెక్టులపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. యంగ్ అడ్వకేట్లు తమ ప్రాక్టీస్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాలి.
సీనియర్ అడ్వకేట్లు నెలకు ఒకసారి లెక్చర్ ద్వారా జూనియర్ అడ్వకేట్లకు మార్గదర్శనం ఇవ్వాలని కోరుతున్నాను. అడ్వకేట్లు అందరూ సామాజిక ఇంజినీర్లు. అందుకే మనపై మరింత బాధ్యత ఉంది.