(రవిచంద్ర ఇనగంటి)
చాట్ జీపీటీ అంటే ఏమిటి? దాన్ని ఎలా వాడుకోవచ్చు?
చాట్ జీపీటీ దాని పేరులో ఉన్నట్లే మనతో చాటింగ్ (సంభాషణ) జరిపే ఒక సాఫ్ట్వేరు.
దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే.. మనం చాలా కాలం నుంచి అంతర్జాలంలో (ఇంటర్నెట్) వెతకడానికి గూగుల్, బింగ్, యాహూ లాంటి శోధనా యంత్రాలు (సెర్చ్ ఇంజన్లు) వాడుతున్నాం.
అయితే వీటిలో మనం వెతికిన సమాచారం నేరుగా దొరకదు. ముందుగా మనం వెతికే పదాలను బట్టి అది ఏయే వెబ్ సైట్లో దొరుకుతుందో ఒక జాబితాను ఇస్తాయి శోధనా యంత్రాలు. వాటిలో మనకు కావలసిన సమాచారం కోసం వెతుక్కుంటాం.
చాట్ జీపీటీ అలా కాదు. మనం అడిగిన ప్రశ్నకు కొన్ని లింకులు మొహాన పడేసి నువ్వే వెతుక్కో పో అని చెప్పదు. సూటిగా సమాధానం ఇస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ అది సరైన సమాధానం కాకపోవచ్చు, శోధనా యంత్రాలు చూపించే ఫలితాల్లాగే.
ఎందుకంటే చాట్ జీపీటీ ఇప్పటి దాకా మనం రాసి ఆన్ లైన్ కి ఎక్కించిన సమాచారాన్నంతటినీ చదివి ఒక అభిప్రాయం ఏర్పరుచుకుని ఉంటుంది. ఈ ప్రక్రియనే మనం మెషీన్ లెర్నింగ్ అంటున్నాం. ఆ అభిప్రాయాన్ని బట్టే అది సమాధానం ఇస్తుంది.
బాగానే ఉంది సంబడం, మనం రాసింది చదివి తిరిగి మనకే ఒప్పజెపుతుంది, అయితే దాని గొప్పేంటి అని మనకు అనుమానం రావచ్చు. మానవులకు ఉన్న కొన్ని పరిమితుల వల్ల, మనం అది చేసినంత శ్రద్ధగా ఈ పని చేయలేము. అందుకనే అది అంత ప్రజాదరణ పొందుతోంది.
దాన్ని కవిత్వం రాయమన్నాము అనుకోండి. అప్పటి దాకా వందల కొద్దీ కవులు రాసిన కవిత్వంలోనుంచి పదాలు కలగలపి మరో కొత్త కవిత సృష్టిస్తుంది అంతే తప్ప దాని సృజనాత్మకత ఏమీ లేదు. అలాగే ఫలానా సమస్యకు కోడ్ రాయమని చెప్పామనుకోండి. ఇప్పటి దాకా ప్రోగ్రామర్లు రాసిన కోడ్ ని మధించి నీకు కావలసిన కోడ్ ని రాసిపెడుతుంది. ప్రోగ్రామింగ్ అనేది ఒక సైన్సు మాత్రమే కాదు. ఒక కళ కూడా. ఆ కళను మాత్రం చాట్ జీపీటీ చూపించలేదు.
పదుగురాడిన మాట పాడియై ధర జెల్లు అని వేమన పద్యం ఉంది కదా. చాట్ జీపీటీ దృష్టిలో సమాచారం విలువ కూడా అంతే. ఉదాహరణకి గాంధీ చెడ్డవాడు అనే వందల వేలకొద్దీ రాతలతో దానికి ట్రెయినింగ్ ఇస్తే సమాధానం కూడా అలాగే ఇస్తుంది. తెలుగు రాని స్నేహితుడు వచ్చి తెలుగు నేర్పించమని మిమ్మల్ని అడిగితే అన్నీ బూతులు నేర్పించారనుకోండి. ఎవరైనా వచ్చి అతన్ని తెలుగులో మాట్లాడమంటే తనకు తెలిసిన ఆ నాలుగు బూతు మాటలే మాట్లాడతాడు.
కాబట్టి దానికి చాట్ జీపీటీ శిక్షకులు ఎంత మంచి సమాచారాన్ని ఇస్తే అంత మంచి సమాధానాలను తిరిగి పొందడానికి అవకాశం ఉంది.