( చంద్ర మోహన్)
భూటాన్ ప్రపంచంలోకెల్లా సంతోషకరమైన దేశం అంటారు. ఎందుకు? దీని వెనుక ఉన్న వివరాలు ఏమిటి?
నేను ఒక సామాజిక సేవా ప్రాజెక్టు పనిమీద భద్రాచలం దగ్గరి దండకారణ్యపు అడవుల్లో కొన్ని రోజులు తిరిగాను. మెయిన్ రోడ్డుకు కనీసం పది కిలోమీటర్లు లోపలికి అడవిదారుల్లో ప్రయాణిస్తే అక్కడ కోయ గూడేలు వస్తాయి.
ఒక్కో కుటుంబమూ ఒక గుడిసె, వారి కోళ్లు, గొర్రెల కోసం ఒక దొడ్డి, చుట్టూ ఒక వంద మీటర్ల ఖాళీ స్థలం ఉంటాయి. అది దాటి మరో వంద మీటర్లలో మరొకరి గుడిసె. మనం చెప్పుకొనే ఫార్మ్ హౌస్ లాంటిది వారు దర్జాగా అనుభవిస్తున్నారు. పక్కనే చిన్ని వాగులు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం.
విద్యుత్తు, ఫోనులు వంటివి లేవు. ఇష్టమైతే వేటకు వెళతారు. మూడ్ లేకపోతే వారు తయారు చేసుకొన్న ఇప్పసారానో, కల్లో తాగి, చికెన్ తిని హాయిగా చెట్టు కొమ్మలపై పడుకొని నిద్రపోతారు. వారిని చూసినప్పుడు ఇదికదా జీవితం! ఇదికదా వైభవం! అనిపించింది.
అయితే అక్కడినుండి తిరిగి వచ్చాక రెండు నెలలకు నాకు టీబీ వచ్చింది. దాదాపు సంవత్సరం పాటు మందులు వాడాక తగ్గింది. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే దండకారణ్యంలో నివసించే ఆటవికులకు క్షయవ్యాధి సోకడం చాలా సాధారణం. అక్కడి వారిలో వృద్ధులు ఎందుకు ఎక్కువగా కనిపించలేదో నాకు తరువాత అర్థం అయింది.
సగం మంది కోయలు అరవయ్యో ఏడు చూడకమునుపే మలేరియాతోనో, క్షయతోనో పోతారు. పుట్టిన పిల్లల్లో మూడోవంతు ఐదేళ్ళు గడవకముందే మరణిస్తారు. వారి జీవితాల్లో చావు చాలా సాధారణమైన విషయం. అడవిలోనికి వెళ్లిన మనిషి తిరిగి వస్తాడో లేదో తెలియదు. జీవితం నడిచిపోతూనే ఉంటుంది. ఎవరిని చూసినా సంతోషంగానే కనిపిస్తారు.
భూటాన్ దేశపు సంతోషం అటువంటిదే. అక్కడి ప్రజలు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. మంచుకురిసే ఆ కొండల్లో పెద్దగా పంటలు పండవు. మామూలు ఆవులు, గేదెలు అక్కడ జీవించలేవు. యాక్ అనబడే జడల బర్రెలను మేపుతూ వాటి పాలు త్రాగి, అందులోనుండి వచ్చే చీజ్ తింటూ, వాటి ఉన్నితో నేసిన బట్టలను ధరించి కొండలపై చెక్కలతో, మట్టితో కట్టిన ఇళ్లలో ఉంటారు.
పిల్లలు స్కూలుకు సుమారు ఐదారు కిలోమీటర్లు కొండ చరియలు ఎక్కుతూ దిగుతూ కేరింతలు కొడుతూ ప్రయాణిస్తూ ఉంటారు. జీవితం వారికి ఏది ఇచ్చిందో దానిని సంతోషంగా స్వీకరించి దేవునికి ధన్యవాదాలు తెలుపుకొంటారు. వారి స్థితిగతులపట్ల వారికి అసంతృప్తి లేదు. ఆధునిక సౌకర్యాలపట్ల మోజు లేదు.
కనుక వారి సంతోషాన్ని వారు డబ్బుతో, అది తెచ్చిపెట్టే సౌఖ్యాలతో కొలవదలచుకోలేదు. గ్రాస్ నేషనల్ హాపీనెస్ అని క్రొత్త కొలమానం తయారు చేసుకొన్నారు. ఆ దేశ వాసులను ఎవరిని అడిగినా వారి జీవితంపట్ల వారు ఎంతో తృప్తిగా ఉన్నట్లు, వారి బ్రతుకంతా ఆనందంగా ఉన్నట్లు చెబుతారు.
భూటాన్ చాలా సంతోషం నిండిన దేశమా? అవును. భూటాన్ వెళ్లి అక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి నేను సిద్ధమా? కాదు. ఒక్క గంట కరెంటు లేకపోతే, ఒక్క రోజు నెట్ పనిచేయకపోతే, పది నిమిషాలు ఫోన్లో చార్జి అయిపోతే తట్టుకోలేని జీవితాలు మనవి.
భూటాన్ దూరంనుండి చూడడానికి , ఎప్పుడైనా ఒక నాలుగు రోజులు విహరించి రావడానికి బాగానే ఉంటుంది మనకు. వారి లాగా సంతోషంగా జీవించగల యోగ్యతను మనం ఎప్పుడో పోగొట్టుకొన్నాము. అలాంటి మానసిక స్థితి మనలో ఇంకా మిగిలి ఉంటే మనం ఉన్నచోటే స్వర్గం. అప్పుడు భూటాన్ ఐనా భువనగిరి ఐనా ఒకటే.