భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో ఒక మాట అన్నారు: “రాజ్యాంగం ఎంత మంచిదైనా, అది అమలు చేసే వారు చెడ్డవారైతే అది చెడ్డదిగా మారుతుంది.” నేడు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అంబేద్కర్ వేసిన ఆ హెచ్చరిక అక్షర సత్యమనిపిస్తోంది.
ముఖ్యంగా ప్రభుత్వాలు జారీ చేసే వివాదాస్పద జీవోలు (G.O.s), అసెంబ్లీలో హడావిడిగా ఆమోదించే బిల్లులు చివరకు న్యాయస్థానాల గడప తొక్కడం, అక్కడ మొట్టికాయలు వేయించుకోవడం ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది.
న్యాయస్థానం – ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం
ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం—ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో వందలాది జీవోలు కోర్టుల ద్వారా కొట్టివేయబడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం నుండి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని అర్ధాంతరంగా తొలగించడం వరకు… ప్రతి సందర్భంలోనూ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
న్యాయమూర్తులు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, “రాష్ట్రంలో అసలు రాజ్యాంగం అమలులో ఉందా?” అని ప్రశ్నించే స్థాయికి వెళ్లడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఒక ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న వ్యక్తికి చట్టం పట్ల గౌరవం లేనప్పుడు, వ్యవస్థల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది.
కేవలం జీవోలే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లుల విషయంలోనూ పెద్ద యుద్ధమే జరుగుతోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య నడిచిన ‘బిల్లుల పోరు’ చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రజల కోసం చట్టాలు చేయాల్సిన సభలు, వ్యక్తిగత పంతాలకు వేదికలుగా మారుతుండటం శోచనీయం.
మనం ఎటు వెళ్తున్నాం?
రాజ్యాంగం అనేది ఒక పుస్తకం మాత్రమే కాదు, అది దేశానికి వెన్నెముక.
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిమితుల్లో తాము ఉండాలి. ఒక జీవోను కోర్టు కొట్టివేసిందంటే, అది కేవలం సాంకేతిక లోపం కాదు… అది ప్రజల హక్కులను కాలరాయడమే. ప్రభుత్వాలు చేసే ప్రతి తప్పును కోర్టులే సరిదిద్దాలి అనుకోవడం కూడా ఒక రకంగా వ్యవస్థల వైఫల్యమే. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని చదువుకోవాలి, కేవలం అధికారాన్ని మాత్రమే కాదు.
చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రాథమిక సూత్రాన్ని పాలకులు మర్చిపోకూడదు. కోర్టులు ఇచ్చే తీర్పులు కేవలం శిక్షలు మాత్రమే కాదు, అవి పాలకులకు దారి చూపే దిక్సూచీలు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించాల్సిన బాధ్యత కేవలం న్యాయమూర్తులదే కాదు, ఓటు వేసి ఎన్నుకున్న ప్రజలది కూడా!
రాజ్యాంగం గెలవాలి… ప్రజాస్వామ్యం నిలవాలి!
అంబేద్కర్ జయంతి సందర్భంగా అవి గుర్తుచేసుకోవడం, ఆయన వ్రాసిన రాజ్యాంగానికి విలువనిచ్చే వారిని ఎన్నుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అని భావిస్తున్నాను.