కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య

బిహార్‌ లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్‌ ట్రయల్‌ ఖైదీని దుండగులు న్యాయస్థానం ప్రాంగణంలోనే కాల్చి చంపారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పట్నాలోని దనాపుర్‌ కోర్టు లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌ శర్మ సోదరుడి హత్య కేసులో చోటే సర్కార్‌ అనే వ్యక్తి అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం అతడిని బేవుర్‌ జైలు నుంచి దనాపుర్‌ కోర్టుకు తీసుకొచ్చారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి దూసుకొచ్చి చోటే సర్కార్‌పై పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సర్కార్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలతోనే అతడిపై దాడి చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Leave a Reply