Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లి పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయి

` అంగన్‌ వాడీలకు టీడీపీ అండగా ఉంటుంది
` రిలే నిరాహార దీక్షలు ముగిసే వరకూ దీక్షా శిబిరం వద్దకే అన్న క్యాంటిన్‌
` టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం :ముఖ్యమంత్రి జగన్‌ నియంత పాలనతో నిత్యం ప్రజాగ్రహానికి గురవుతున్న నేపధ్యంలో తాడేపల్లి పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. డిమాండ్ల సాధన కోసం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని ఎస్‌కెఆర్‌ మహిళ కళాశాల సమీపంలో ఉన్న ఐసీడిఎస్‌ రాజమండ్రి ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా ఆశా కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబారానికి టీడీపీ నాయకులతో ఆయన వెల్లి పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన అంగన్‌ వాడీ వర్కర్లు, ఆయాల ఆవేదనను విన్నారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా వెళుతోందన్నారు. అంగన్‌ వాడీ కార్యకర్తల జీతాన్ని 4200 నుంచి 10500లకు హెల్పర్ల జీతాన్ని 2950 నుంచి 6 వేలకు పెంచింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో జగన్‌ అంగన్‌ వాడీలకు ఏం చేశారని ప్రశ్నించారు. పనికి రాని యాప్‌లు, వైకాపా నేతల వేధింపులు, అధికారుల సమీక్షలతో అంగన్‌వాడీలను ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని ఇచ్చిన హామీ.. నీటి మీద రాతలా మిగిలిపోయిందన్నారు. ఐసీడీఎస్‌ ద్వారా గత 48 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించంలో ప్రభుత్వం విఫలమైందని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ తక్షణమే అంగన్‌ వాడీల సమస్యలను పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాట మార్చి… మడం తిప్పేసిన ఈ దుర్మార్గపు ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని, అసలు అంగన్‌ వాడీలకు ఈ ప్రభుత్వం చేసిన మంచేంటని ప్రశ్నించారు.

అంగన్‌ వాడీ వర్కర్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ టీడీపీ వారికి అండగా ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో వారు రిలే నిరాహార దీక్ష చేపట్టినన్ని రోజులూ తమ ఆధీనంలో నడుస్తున్న మొబైల్‌ అన్న క్యాంటిన్‌ వారి దీక్షా శిబిరం వద్దకే పంపించి అంగన్‌ వాడీ వర్కర్ల ఆకలి తీరుస్తామన్నారు.

టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు, తెలుగు మహిళ నగర కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, అంగన్‌ వాడీ కమిటీ నగర అధ్యక్షురాలు బోను ఈశ్వరి, మాజీ కార్పొరేటర్‌ బొమ్మనమైన శ్రీను, అహ్మదున్నీషా, కర్ణం లక్ష్మీ నాయుడు, మోతా నాగలక్ష్మి, నాగలక్ష్మి, పాడి లలిత, మదీసా సాహెబ్‌, మేరీ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

LEAVE A RESPONSE