Suryaa.co.in

Andhra Pradesh

2024ఎన్నికల్లో చంద్రబాబుకు జీరో స్థానాలు

– కుప్పంతో సహా అన్నిస్థానాల్లోనూ టీడీపీ ఓడిపోవడం తథ్యం
– జగన్‌ అత్యంత పారదర్శక పాలనపై అన్నివర్గాల్లోనూ సంతోషం
– వైఎస్‌ఆర్‌సీపీ 175కి 175 స్థానాల్ని కైవసం చేసుకుంటుంది
– చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు ఏపీకి గెస్టులే..
– ఏపీ రాజకీయాలకు వీరు అనర్హులు
– తాంత్రిక పూజలపై నమ్మకంతోనే అధికారంలోకి వస్తానని బాబు కలలుకంటున్నాడేమో..!
– అందుకే, పచ్చమీడియాలో పిచ్చిరాతలపై రోత ప్రెస్‌మీట్‌లు పెడుతున్నాడు
– 2019లోనే బాబును ప్రజలు పూర్తిగా రిజెక్ట్‌ చేశారని గుర్తుంచుకోవాలి
– ఉద్దానంపై నాడు కోతలు.. నేడు నోరుమెదపని బాబు,పవన్‌లు
– మా పార్టీ సమన్వయకర్తల్ని మార్చుకుంటే బాబుకు నొప్పేంటి..?
– చంద్రగిరి నుంచి కుప్పానికి బాబు ఎందుకు ట్రాన్స్ ఫర్ అయ్యారు?
– బీసీ స్థానాల్లో చంద్రబాబు,లోకేశ్‌ లు ఎలా పోటీచేస్తారు..?
– వైఎస్‌ఆర్‌సీపీ ఫర్‌ఫెక్ట్‌ టీమ్‌తో ఎన్నికల బరిలోకి దిగుతుంది
– మా పార్టీలో ఎమ్మెల్యే స్థానాలు,పార్టీ పదవులూ రెండూ సమానమే
– రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

నాలుగున్నరేళ్ళుగా అవే కుట్రలు
ప్రజల్లో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే తన కుట్రల పంథాలో పోతుంది.గడచిన నాలుగున్నరేళ్లుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేసే ప్రతీ కార్యక్రమాన్ని పచ్చ మీడియా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. అభూత కల్పనలతో చెత్త రాతలు రాయడం, వాటిని పట్టుకుని చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం జరుగుతుంది. తమ హయాంలో జరగని అభివృద్ధి గడచిన నాలుగున్నరేళ్లల్లో చూస్తున్నామనే విషయాన్ని చంద్రబాబు, ఆయన పచ్చమీడియా జీర్ణించుకోలేకపోతుంది.

ముందెన్నడూ జరగని అభివృద్ధి- సంక్షేమం, సంస్కరణలు.. రాష్ట్రంలో ఇప్పుడు ఐదు కోట్ల మంది ప్రజలు అనుభవపూర్వకంగా చూస్తున్న విషయం వాస్తవం. రాష్ట్రంలోని 1 కోటి 60 లక్షల కుటుంబాల్లో దాదాపు 1 కోటి 47 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి జరిగిందని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాల లబ్ధిని పేదలు తమ హక్కు కింద అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా.. అక్కడ నాలుగైదు కొత్త భవనాలొచ్చి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత రూపురేఖలే మారాయి. అదేవిధంగా గడప గడపకు ప్రభుత్వ పరిపాలన అందుతోంది.

రాష్ట్రంలో దాదాపు 35 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై ముఖ్యమంత్రి జగన్‌ పేదలకు సర్వహక్కులు కల్పించడం.. గతంలో ఎలాంటి హక్కుల్లేని వారికి విలువైన ఆస్తులు రావడం .. ఇల్లులేని నిరుపేద అక్కాచెల్లెమ్మలకు 31 లక్షల ఇంటి స్థలాల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ స్థలాలకు సంబంధించిన విలువ దాదాపు రూ.70వేల కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని నిర్ణయించి.. అందులో 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి. మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను జనవరి ఆఖరికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.

దాదాపు రూ.16వేల కోట్లతో నాడు – నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలన్నీ ప్రభుత్వం మార్చింది. మరోవైపు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తూ విద్యార్థులకు బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌తో డిజిటల్‌ బోర్డులతో పేదలకు అందని ద్రాక్షగా ఉన్న నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతోంది. స్వాతంత్య్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు లేని 17 మెడికల్‌ కాలేజీలను జగన్‌ గారి ప్రభుత్వం తెస్తే.. ఎవరూ ఇంతవరకూ పట్టించుకోని ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యను ఆగమేఘాల మీద పరిష్కరించిన ముఖ్యమంత్రి జగన్‌ ..

నాడు కోతలు.. నేడు నోరుమెదపని బాబు,పవన్‌లు
ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల ప్రభావంతో వేల మంది చనిపోయారు. ఆ గ్రామంలో పెళ్ళి చేసుకోవాలంటే గతంలో పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అంత భయానకంగా ఉన్న పరిస్థితికి ఈరోజు కిడ్నీ రీసెర్చీ సెంటర్‌ ఏర్పాటుతో జగన్‌ శాశ్వత పరిష్కారం చూపారు. 2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఉద్దానంకు ఏమీ చేయలేదు. అతని దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ కూడా గతంలో ఉద్దానం ప్రాంతంపై పెద్దపెద్ద కోతలు కోశాడు. ప్రత్యేక హెల్త్‌ క్యాంపులు పెట్టిస్తానన్నాడు. చివరికి ఏమీ చేయకుండా చేతులెత్తేశాడు. మరి, ఇప్పుడు దాదాపు రూ.800 కోట్లు ఖర్చుపెట్టి జగన్‌ ఉద్దానంలో కిడ్నీ రీసెర్చి సెంటర్‌తో పాటు మంచినీటి శుద్ధి ప్లాంట్‌ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి ప్రారంభిస్తే.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు నోటమాట రావడంలేదు.

2014–19లో ఏం చేశావో చెప్పు బాబూ..?
2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రజల మేలు కోసం నేనిది చేశానని చెప్పవయ్యా అంటే చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడు..? ఇంతగా ఆయన్ను ఎందుకు నిలదీస్తున్నానంటే.. 2014–19 హయాంలో ఏం జరిగిందనేది ప్రజల మస్తిష్కాల్లో ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో ఆయన అధికారంలో ఉండగా ఏమీ చేయకపోగా.. అందరినీ రాచిరంపాన పెట్టాడనే సంగతి అందరికీ తెలుసు. టీడీపీ జన్మభూమి కమిటీల ఘోరాలు, అరాచకాలు ప్రజల మెదళ్లల్లో చెరిపేస్తే చెరిగేవి కావు. బాబు హయాంలో సంభవించిన తుపానులు, కరవులకు సంబంధించి పంటనష్టం,ప్రాణనష్టం లెక్కలు కూడా సక్రమంగా బయటకు చెప్పని పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే..

మాది మానవత్వమున్న ప్రభుత్వం
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు సంబంధించి ప్రతీ జిల్లా కలెక్టర్‌నూ అప్రమత్తం చేశారు. కలెక్టర్లకు ముందుగానే కొంత నిధులు సమకూర్చి, నష్టపోయిన ప్రతీ రైతుకు తక్షణ సాయం అందించడం.. ఇంకా తుపాను బాధిత షెల్టర్‌ కేంద్రాల్లోని వారికీ రూ.2500ల చొప్పున అందించి మానవత్వమున్న ప్రభుత్వంగా రుజువు చేసుకుందామని ఆదేశాలిచ్చారు. మళ్లీ నేను జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్‌ బాగా పనిచేశారని చెప్పేవిధంగా, వారికి పూర్తి ఫ్రీడం ఇచ్చి క్షేత్రస్థాయిలో పనిచేయించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి .

తుపాను నష్టంపై కేంద్రానికి లేఖ రాయడానికి నువ్వెవరు?
తుపాను ప్రభావిత ప్రాంతాల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం భేషైన చర్యలు తీసుకుంటే.. ఈ పెద్దమనిషి చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని.. రూ.10వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి లేఖ రాస్తాడా..? అసలు మతుండే లేఖ రాశాడా..? పంటనష్టం అంచనాపై ఆయనెలా లెక్కలేస్తాడు..? నేనడిగితే కేంద్రం స్పందించిందని చెప్పుకోవడానికే ఆయన ఆరాటపడుతున్నాడా..?

బాధ్యతతో పనిచేసే రాజకీయ నాయకుడి లక్షణాలేమైనా బాబుకు ఉన్నాయా..? సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన బిహేవియర్‌ ఇలా ఉంటుందనుకోవాల్నా..? ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా నష్టపోయిన ప్రతీ రైతునూ ఆదుకునేందుకు పూర్తి చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే.. నువ్వు తప్పుబట్టటానికి ఏ కారణం చూపలేక ఇలా కేంద్ర ప్రభుత్వానికి లేఖలంటూ నాటకాలడతావా..?.

ఏపీకి గెస్ట్ లా వస్తాడు.. గెస్ట్ లా పోతాడు
ఆంధ్రప్రదేశ్‌తో అసలు సంబంధంలేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయనకు ఇక్కడకు గెస్ట్‌లాగా వస్తాడు. గెస్టులాగానే పోవాలి తప్ప ఇక్కడ రాజకీయాలతో ఆయనకేం సంబంధమని ప్రశ్నిస్తున్నాను. గడచిన నాలుగున్నరేళ్లల్లో చాలా పెద్దఎత్తున రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంటే.. ఆయన మాత్రం 300 రోజులు తెలంగాణలో ఉండి ఇక్కడకు గెస్టు మాదిరిగా వస్తూ జరిగే అభివృద్ధిపై ఏదొక అభూతకల్పనల్ని సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లుతాడా..? ఆయన ఏదైతే విషప్రచారాన్ని అల్లి మాట్లాడుతున్నాడో.. ఆ విషప్రవాహంలోనే కొట్టుకుపోతున్నాడని నిన్నటి ప్రెస్‌మీట్‌తో తెలిసిపోయింది.

2019లోనే ప్రజలు చంద్రబాబుకు సున్నా చుట్టారు
మూడు నెలల్లో అధికారంలోకి వస్తానంటూ చంకలు చరుస్తున్న చంద్రబాబుకు మతితప్పిందేమో.. ప్రజామోదంతో అభ్యర్థుల్ని ఎంపిక జేస్తానంటున్నాడు. అసలు, ప్రజామోదం చంద్రబాబుకే లేనప్పుడు.. ఆయన ఎంపిక చేసే అభ్యర్థులకు ఏ ఒక్కరూ ఆమోదించరనే సంగతి ఆయన గ్రహించడం మంచిది. నిజానికి, ఆయన్ను 2019లోనే ప్రజలు ఛీత్కరించారు. నాయకుడిగా రిజెక్టు చేశారు. కానీ, అతను మాత్రం తానింకా అధికారంలోకొస్తానని పగటి కలలు కంటున్నారు. ప్రజలకు మంచి చేసి ఉంటే.. 2019లో 23 సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు..? పైగా, నువ్వు ప్రజల్ని రాచిరంపాన బెట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టావు. అడ్డంగా దోచుకున్న దోపిడీ దొంగవు కాబట్టే ప్రజలు చంద్రబాబును చెత్తబుట్టలో వేశారు.

తాంత్రికపూజల్ని నమ్మి అధికారంలోకి వస్తాననుకుంటున్నాడేమో..
తెలంగాణలో తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని పట్టించుకోకుండా గాలికొదిలేశాడు చంద్రబాబు. కనుక ఆయనకు, ఆయన కొడుకు లోకేశ్‌కు, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌కు మన రాష్ట్రంతో ఏమాత్రం సంబంధంలేదు. జగన్‌ని ప్రజలు వద్దంటున్నారని అతనెలా చెబుతాడు..? గతంలో ఆయన హయాంలో విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రికపూజలు చేయించినట్లు, ఇప్పుడు కూడా ఎక్కడైనా చేతబడుల్లాంటి తాంత్రికపూజలు చేయిస్తున్నాడేమో.. వాటిమీద నమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నాడేమో చూడాలి. ఆయనెంత కుట్రలు చేసినా జగన్‌గారిని, మా ప్రభుత్వాన్ని ఏం పీకలేడని తెలుసుకోవాలి.

చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు బదిలీ అయ్యావ్..?
వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు మాట్లాడటం ఎందుకు..? ఆయనకేం హక్కుందని మాట్లాడుతాడు..? అసలు, నువ్వు నీ కొడుకు బీసీ సీట్ల స్థానాలకు ఎందుకు పోయారు..? చంద్రగిరిని వదిలి కుప్పానికి ఎందుకెళ్లావు..? నీ వియ్యంకుడు బాలకృష్ణకు- హిందూపూర్‌కు .. నీ కొడుకు లోకేశ్‌కు- మంగళగిరికి ఏం సంబంధం ఉందని అక్కడ పోటీ చేస్తున్నారు..? మంగళగిరిలో బీసీ సీటులో నీ కొడుకును ఎందుకు నిలబెడుతున్నావు..?

మరి, మేము వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మంగళగిరికి బీసీ అభ్యర్థిని నిలబెడుతుంటే.. టీడీపీ తరఫున లోకేశ్‌ పోటీచేయడానికి సిగ్గుండాలి కదా..? మా పార్టీ అభ్యర్థుల ఎంపిక, వారి స్థానాల కేటాయింపు అనేది ఒక శాస్త్రీయబద్ధంగా, విలువలతో కూడిన రాజకీయ ప్రణాళిక ప్రకారం నడుస్తోందని మేము ముందునుంచీ చెబుతున్నాం. అందులో భాగంగానే మా నాయకుడు జగన్‌ గారు నిర్ణయాలు తీసుకుంటారు. వీటిపై ప్రతిపక్షాలకేం పని..? ఆ పార్టీల భవిష్యత్తేంటో అవి చూసుకోవడం మంచిదని హితవు చెబుతున్నాను.

పటిష్టమైన టీమ్‌తో రావాలనేదే జగన్‌ ఆలోచన
విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేయాలనేది మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారి అభిమతం. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేల పనితీరుపై అధికారంలోకొచ్చిన ఏడాది తర్వాత నుంచీ జగన్‌ గారు చెబుతూనే ఉన్నారు. రేపటి ఎన్నికలకు సంబంధించి ప్రజల మేలుకు అవసరమైన సమర్ధమైన నాయకులతో బరిలోకి దిగబోతున్నాం. అందుకే, ఫర్ఫెక్ట్‌ టీమ్‌ కోసం కసరత్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే స్థానాలు ఎంత ముఖ్యమో.. పార్టీ పదవులు కూడా అంతే ముఖ్యమైనవిగా బాధ్యతతో కూడిన పదవులుగా చూడాలి.

కాబట్టి, మా పార్టీ నాయకులు కూడా ఎక్కడా ఆందోళనపడాల్సిన అవసరం లేదని.. మీ వంతుగా మీరు కృషి చేస్తే ఆ తర్వాత మీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలనేది పూర్తిగా వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయంగా చెబుతున్నాం. ఎవరు ఎక్కడ అవసరమో.. వారిని అక్కడ పెట్టి పనిచేయించుకుంటామనే విషయంలో ఎవరికీ సందేహాలవసరంలేదని స్పష్టం చేస్తున్నాను.

2024 ఎన్నికల్లో చంద్రబాబుకు సున్నా సీట్లే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుచుకునే అవకాశం లేదు. కుప్పంతో సహా అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి- సున్నా టీడీపీగా మిగిలే పరిస్థితి ఉంది. దీనికి రేపు ఆయన ఏదొక కారణం చెప్పడానికి వీలుగా ముందుగా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నాడు. అందుకే, అత్యంత పారదర్శకంగా పాలన నడుస్తోన్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలకు కుట్రలు చేస్తున్నాడు.

తనకు వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 మరో తోక మీడియాలను పట్టుకుని వాటితో అభూతకల్పనల కథనాల్ని రాయించడం.. వాటిపైనే ఈయన మరోమారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడటం చేస్తున్నాడు. వీటిల్లో భాగంగా మరోవైపు మేధావుల సంఘాలంటూ ఊరూపేరులేని వ్యక్తుల్ని తీసుకొచ్చి వారికి ఏదొక పదవుల్ని తగిలించి ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పడం.. వారి నోటిమాటల్ని ప్రజాభిప్రాయంగా చిత్రీకరించాలనే ప్రయత్నాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ, న్యూట్రల్‌ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర
అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎలాంటి కుట్రలకైనా దిగే మనస్తత్వం చంద్రబాబుది. ఒకపక్కన పచ్చమీడియాతో ప్రభుత్వ పాలనపై విషాన్ని చిమ్మడం, ఆ చిమ్మిన విషాన్ని ప్రజల్లోకి ప్రచారం చేయడం చేస్తూనే ఉన్నాం.. మరోపక్కన వైఎస్‌ఆర్‌సీపీ మద్ధతుదార్ల ఓట్లుతో పాటు న్యూట్రల్‌ ఓట్లను కూడా తొలగింపునకు చంద్రబాబు అండ్‌ కో కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే కోనేరు శిరిష్‌ అనే టీడీపీ వ్యక్తి చేత బల్క్‌ ఓట్లను అనుమానస్పదంగా ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు.

తీరా, వాటిపై జిల్లా కలెక్టర్లు తమ విలువైన సమయాన్నంతా వెచ్చించి వెరిఫై చేయిస్తే బోగస్‌ ఓట్ల ఆరోపణలో వాస్తవాలేమీ లేవని తేలింది. నిజానికి, దొంగ ఓట్ల నమోదుకు ప్రత్యేక శిబిరాల్ని పెట్టి ఆన్‌లైన్‌లో మాల్‌ప్రాక్టీస్‌ వాళ్లు చేస్తున్నారు. నిన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఓట్లేసిన చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లందరినీ మరలా ఆంధ్ర ఎన్నికల్లోనూ పాల్గొని టీడీపీకి ఓట్లేయించాలని ప్రయత్నిస్తున్నారు. మై టీడీపీ యాప్‌లంటూ నాలుగైదు వెబ్‌సైట్‌లు పెట్టి పీపుల్స్‌ రిప్రెంజెంటేషన్‌ చట్టాన్ని ఉల్లఘిస్తూ ప్రజల డేటాను అనధికారంగా సేకరించడం.. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి మరీ నూతనంగా ఓటు హక్కు నమోదుకు రిజిస్ట్రేషన్‌లు భారీగా చేస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మేము ఫిర్యాదిచ్చాం.

వాలంటీర్లను గడపగడపకు తిరగకూడదని చెప్పే హక్కు మీకెక్కడిది?
ఇటీవల మేధావుల సంఘమని ఎవరెవరో మాజీ అధికారులు మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాలంటీర్‌ల వ్యవస్థ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ స్వచ్ఛందంగా పనిచేస్తున్న వ్యవస్థ అది. ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఎవరికెంత మంచి చేసిందనేది ప్రజలకు కళ్లకు కట్టినట్లు తెలియపరిచేందుకు ఇంటింటికీ వాలంటీర్‌ వెళ్లడంలో తప్పేంటి..?

మరి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సంక్షేమాన్ని అదే వాలంటీర్‌ ద్వారానే కదా అందుతోంది..? అలాంటప్పుడు, వాలంటీర్లను గడప గడపకు తిరగరాదని చెప్పే హక్కు ఆ మేధావులకెక్కడిది..? కనుక, చంద్రబాబుకు సపోర్టు ఇద్దామని పూనుకున్న వారు తమ నోళ్లను సరిచేసుకుంటే మంచిది. లేదంటే, ప్రజల దృష్టిలో వారంతా పలుచన కాక తప్పదు.

LEAVE A RESPONSE