Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ వైపు ‘ఉండి’ ‘రామ’బాణం?

– ఎంపీ రాజు రాకతో మారుతున్న సమీకరణలు
– వైసీపీ వైపు రామరాజు చూపు?
– నర్శింహరాజును మార్చాలన్న షరతు?
– మిథున్‌రెడ్డితో రాయబారం?
– ఆయన పార్టీ మారబోరంటున్న తమ్ముళ్లు
– ఇప్పటికే రఘురామరాజుకు ఉండి ఇచ్చేశారన్న ప్రచారం
– కానీ ఇప్పటిదాకా అధికారికంగా వెలువడని ప్రకటన
– ఉండిలో చర్చ

ఉండి: నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే సీటు ఖరారయిందన్న వార్తల నేపథ్యంలో.. ఉండి నియోజకవర్గ టీడీపీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ఇప్పటికే సీటు ప్రకటించిన టీడీపీ.. కొన్ని సమీకరణల నేపథ్యంలో ఎంపి రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

నిజానికి రఘురామరాజు నర్సాపురం ఎంపీ సీటుకే ఇప్పటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇది సాధ్యం కాని నేపథ్యంలో, ఎంపి రాజుకు న్యాయం చేసే లక్ష్యంతో.. ఆయనకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఆమేరకు రెండు,మూడురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికే ఆయనకు ఉండి సీటు ప్రకటించారన్న ప్రచారం సోషల్‌మీడియాలో విస్తృతంగా జరుగుతోంది.

అయితే.. దీనితో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో రామరాజుకు సానుభూతి పెరిగిందని, దానిని వైసీపీలో చేరి టికెట్ సాధించుకునే మార్గం ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామరాజు వైసీపీలోకి వెళితే అక్కడే సీటు ప్రకటించిన నర్శింహరాజును మార్చాల్సి ఉంటుంది. ఆయనను మార్చి తనకు సీటు ఇస్తే, పార్టీలో చేరతానన్న ప్రతిపాదన పంపారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ మేరకు వైసీపీ ఎంపి మిథున్‌రెడ్డి ద్వారా రాయబారం పంపారన్న చర్చ ఉండిలో జోరుగా జరుగుతోంది.

దీనిపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎంపి రఘురామకృష్ణంరాజు ఉండికి వచ్చినా, రామరాజుకు పార్టీ అధినేత చంద్రబాబు న్యాయం చేస్తారని ఒక వర్గం చెబుతోంది. నిజానికి రామరాజుగారే రఘురామరాజుకు మద్దతునిస్తున్న విషయం తెలియక ఈ ప్రచారం చేస్తున్నారంటున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఆ మాత్రం త్యాగాలు తప్పవని, వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని స్పష్టం చేస్తోంది. మరో వర్గం మాత్రం.. రామరాజుకు అన్యాయం చేస్తే సహించేది లేదని, అవసరమైతే వైసీపీలోకి వెళ్లి తమ సత్తా చూపిస్తామని వాదిస్తున్నారు.

అయితే రఘురామకృష్ణంరాజుకు ఉండి సీటుపై, ఇప్పటిదాకా ఎమ్మెల్యే రామరాజు ఇప్పటిదాకా స్పందించలేదని గుర్తు చేస్తున్నారు. ‘రామరాజు గారు స్పందించకుండా ఏదేదో చర్చించుకోవడం సరికాదు. ఆయన వైసీపీలోకి వెళతారన్న చర్చ జరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ, రాజు గారు ఆ పార్టీలోకి చేరతార నుకోవడం లేదు. ఏదైనా ఇప్పుడు సీటు ఆయనదే కాబట్టి ఈ పుకార్లను ఆయనే ఖండించాలి. లేకపోతే అనవసరంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని మేం కూడా నమ్మాల్సి ఉంటుంద’’ని ఉండి పట్టణ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రామరాజు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A RESPONSE