– కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
నెల్లూరు: నెల్లూరులో మాజీ సీఎం వైయస్ జగన్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇంతగా దిగజారిపోవాలా అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. స్థానిక వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ఎప్పుడూ చూడని విధంగా రోడ్లను తవ్వి జనంను ఆపాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు అడ్డం పెట్టి అభిమానులను వైయస్ జగన్‌కు దూరం చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. లాఠీచార్జ్‌తో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులను దుర్మార్గంగా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా వైయస్ జగన్‌కు ఉన్న ప్రజాదరణను ఆవగింతైనా తగ్గించలేకపోయారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే…
మా పార్టీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను పరామర్శించడానికి మాజీ సీఎం వైయస్ జగన్ నెల్లూరు పర్యటనకు వస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోయారు. ఆంక్షల పేరుతో చివరి వరకు ఆయన పర్యటనను అడ్డుకోవాలని చూశారు. చివరికి అది సాధ్యం కాకపోవడంతో ఆయన కోసం వచ్చే వేలాది మంది అభిమానులను పోలీసులతో బెదిరించి, భయపెట్టి రోడ్ల మీదకు రాకుండా చేయడానికి ఆఖరి క్షణం వరకు ప్రయత్నించారు.
హెలిప్యాడ్ దగ్గర, జైలు వద్ద, ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విచిత్రమైన ఆంక్షలు సృష్టించి జగన్ పర్యటనకు ప్రజలెవరూ రాలేదని మీడియాలో చూపించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వైయస్ జగన్ కోసం వచ్చే వెలకట్టలేని ప్రజాభిమానాన్ని ఎవరికీ ఆపతరం కాదని నెల్లూరు పర్యటనతో మరోసారి నిరూపితమైంది.