– ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం మరింత ఉధృతం
– ప్రజా సంఘాలు, వామపక్ష నేతల హెచ్చరిక
విజయవాడ: విద్యుత్ చార్జీలు సర్దుబాటు చార్జీలను పెంచి కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ప్రజలను వంచించింది. సంవత్సర కాలంలోనే 30 వేల కోట్ల రూపాయల భారం వేసిందని వామపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు.
ప్రజా వేదిక పిలుపుమేరకు మంగళవారం విజయవాడ, అజిత్ సింగ్ నగర్ లోని విద్యుత్ కార్యాలయం వద్ద ప్రజాసంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన నిర్వహించారు. వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు, దోనేపూడి శంకర్, పి.ప్రసాద్, సుధీర్, రమణారావు, భాస్కరరావు, సాంబశివరావు, దుర్గారావు తదితర నేతలు మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ అండదండలతో అదానీ విద్యుత్ రంగాన్ని కబళిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కేంద్ర ఒత్తిళ్లకు లొంగిపోయి అదానీతో స్మార్ట్ మీటర్లు, సోలార్ విద్యుత్ పై అక్రమ ఒప్పందాలను చేసుకున్నది, పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడింది. కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్దకపోగా, అదే దారిలో నడుస్తోంది. మద్యం కుంభకోణాలపై విచారణ జరుగతున్న కూటమి ప్రభుత్వం, విద్యుత్ ఒప్పందాలపై నోరు మెదపటం లేదు.
ఆదాని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇతర కార్పొరేట్ కంపెనీలతో కూటమి సర్కార్ కుమ్మక్కు అవుతోంది. విద్యుత్ భారాలతో ప్రజల జేబులు ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీల ఖజానా నింపుతోంది. విద్యుత్ సంస్కరణ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలకై పోరు సాగించాలి. ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకపోతే విద్యుత్ ఉద్యమన్ని మరింత తీవ్రతరం చేస్తాం.