– తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా?
– బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడ తారు
-ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్ లా ఉంది
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ పై కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు తొలగించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను బీ ఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా స్థాయి నుంచి నగర, పట్టణ, మండల స్థాయిలో నాయకులు తిలకించారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ లు సృష్టించిన అపోహలను పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ ఇచ్చిన బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు, ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుటిల కుతంత్రాలకు ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే, తెలంగాణ చరిత్ర తిరగరాసేలా మరో మహా సంగ్రామానికి తెరదీస్తామని జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన చూస్తుంటే అలనాడు భద్రాచలంలో రామందిరం నిర్మించిన రామదాసును జైల్లో పెట్టినట్లు, తెలంగాణ ప్రజల కొంగు బంగారం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను కూడా జైలులో పెట్టాలని కుట్ర చేస్తున్నట్లుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణను సర్వనాశనం చేసి చంద్రబాబుకు గురుదక్షిణం చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుతంత్రాలు చేస్తున్నారని, ఇందుకు అడ్డంగా ఉన్న కేసీఆర్ ను అడ్డు తొలగించుకునే కుట్రలో భాగమే కాళేశ్వరం కమీషన్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.