– అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారా?
– ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా ముస్లింల కోసమేనా?
– కేసీఆర్ కుటుంబం కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకుంది
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
సిర్పూర్ కాగజ్ నగర్: తెలంగాణ తల్లిగా ప్రజల మనసులను గెలుచుకున్న సుష్మాస్వరాజ్ కి, అలాగే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్ పుణ్యతిథి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నాం. తెలంగాణ కోసం చేసిన త్యాగాలు ఎన్నటికీ మరువలేనిది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49తో ఆదివాసీల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం దాకా తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నాటకాలన్నీ ప్రజలను మోసం చేయడానికే. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఈ నాటకాలు సాగిస్తోంది.
ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల రీఅలైన్మెంట్ తర్వాత ఈ ప్రాంతంలో సాగునీటి కోసం బలమైన డిమాండ్ ఉంది. దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీరు రావాలంటే తుమ్మడిహట్టిలో వేరే ప్రాజెక్టు నిర్మించాల్సిందే. వార్ధా, వైన్‌గంగా నదుల సంగమం వద్ద ప్రాజెక్టు కడితే సాగునీటి కొరత ఉండదు. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
కేంద్రం ఇప్పటికే అనేక చిన్న ప్రాజెక్టులకు డీపీఆర్ సమర్పించగానే అన్ని విధాలుగా సాయం అందిస్తోంది. కాబట్టి వార్ధా-వైన్‌గంగా సంగమ ప్రాంతంలో నిర్మించాల్సిన ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారుచేసి వెంటనే కేంద్రానికి సమర్పించాలి.
రైతులకు మేలు చేసే ప్రాజెక్టులకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో మాత్రం మేం వ్యతిరేకించాం. లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా నిజంగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందింది? ఎంతమంది రైతులకు మేలు జరిగిందనేది ముఖ్యం.
ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాల వలన పలు రిజర్వాయర్లు పగిలిపోయాయి, మెడిగడ్డ బ్యారేజ్ దెబ్బతింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహించిన విచారణలో డిజైన్ లోపాలు, నాణ్యత లోపాలు ఉండటాన్ని స్పష్టంగా చూపించారు. ఇవన్నీ బీఆర్ఎస్ చేసిన పాపాలే. ఈ పాపాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా స్వతంత్ర ఏజెన్సీ ద్వారా జరగాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేవలం కొన్ని విషయాల్ని మాత్రమే వెల్లడించింది. కాళేశ్వరం అవినీతి విషయంలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబమే దుర్వినియోగం చేసింది. నిజానికి కేసీఆర్ కుటుంబం కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకుంది.
ఇది జరిగినప్పుడు కేవలం అధికారులనే ఎందుకు అరెస్ట్ చేశారు? అప్పటి రాజకీయ నాయకులు, మంత్రులు, కాంట్రాక్టర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ విచారణ విషయంలో అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారా? అనే అనుమానం కలుగుతోంది. కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాలతో పాటు మిగిలిన అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరగాలి.
కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పేరిట ఎకరాకు రూ.15,000 ఇస్తామని చెప్పింది. కానీ అదీ ఇవ్వలేదు. మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏడాది రూ. 6,000 (3 విడతల్లో రూ.2,000 చొప్పున) డైరెక్ట్‌గా రైతుల ఖాతాలో జమ చేస్తోంది.
ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లు నేరుగా ఖాతాల్లో జమయ్యాయి. కానీ కాంగ్రెస్ కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వ్యవహరిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 50 సార్లు ఢిల్లీకి వెళ్లారు. కానీ రైతులకు, ప్రజలకు మేలు చేసింది లేదు.
తమ మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 10% ముస్లింల రిజర్వేషన్లను బీసీ బిల్లులో చొప్పించాలని చూస్తోంది. అంటే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా ముస్లింల కోసమేనా? కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే. ప్రజలకు ఇది అర్థమవుతోంది.
ప్రజల్లో ఇప్పుడు స్పష్టమైన భావన ఉంది.తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనే కోరిక. తెలంగాణ ప్రజలు ఇఫ్పుడు బిజెపి వైపు స్పష్టంగా చూస్తున్నారు. నాయకులు, ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు కాకుండా.. స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారు.