– రాజకీయాలు ఆపాదించి దళిత అధికారులను బలి పశువులు చేయొద్దు
– పోస్టింగ్ లలో అగ్రవర్ణాల అధికారులకు ఒక న్యాయం దళిత అధికారులకు మరో న్యాయం తగదు
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ లేఖ
విజయవాడ: సమాచార పౌర సంబంధాల శాఖలో ఎలాంటి ఆరోపణలు,పాత్ర లేని దళిత మహిళ అధికారి కస్తూరిబాయి కి తక్షణమే పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి రాసిన లేఖలో సురేష్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటన ఇచ్చే అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను అందరికీ పోస్టింగులు ఇచ్చి ఎలాంటి తప్పు చేయని,అసలు సంబంధం లేని మహిళా అధికారి జాయింట్ డైరెక్టర్ తేళ్ల కస్తూరిబాయి కి పది నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచటం సహజన్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు.
పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం,ఇవ్వకపోవటం పై ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఐ అండ్ పిఆర్ కమిషనర్ పరిధిలో ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కమిషనర్ గా పనిచేసిన విజయకుమార్ రెడ్డి పై మాత్రం ఎలాంటి విచారణ, చర్యలు లేకుండా అతన్ని కేంద్ర సర్వీసులకు పంపటం అక్షేపణీయమని తెలిపారు.
అందులో మిగతా అధికారులకు కూడా తిరిగి పోస్టింగ్ లు ఇచ్చారని కేవలం దళిత మహిళా అధికారి అయిన కస్తూరిబాయికి మాత్రం అధికారులు పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఆమె పట్ల అధికారులకు ఉన్న వివక్ష, అవమానకర వైఖరి వల్లే అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విజిలెన్స్ విచారణలో కస్తూరిబాయి పాత్ర ఏమీ లేదని, ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవనే విషయం ఉన్నతాధికారులకు తెలుసని అన్నారు.
కస్తూరి బాయి కి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడానికి ,ప్రభుత్వ పెద్దలు, అధికారుల వద్ద ఆమెను ఇబ్బంది పెట్టేలా, ఆమెకు ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసేలా కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో కథనాలు ప్రచురించి కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
దళిత అధికారులు, ఉద్యోగులకు రాజకీయాలను ఆపాదించి బ్లాక్ మెయిల్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని దళిత అధికారులు,ఉద్యోగులను కోరారు. దళిత మహిళా అధికారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా,ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కథనాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచురిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని సురేష్ బాబు కోరారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పార్థసారథి ఈ అంశంలో జోక్యం చేసుకొని తక్షణమే ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని,తద్వారా దళిత అధికారులు,ఉద్యోగులకు ధైర్యం,ఆత్మగౌరవం పెంచేలా భరోసా కల్పించాలని సురేష్ బాబు కోరారు.