– బీజేపీ రాష్ట్ర మాధవ్
బాపట్ల: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ బాపట్లలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమావేశం పటేల్ నగర్లోని జిల్లా కార్యాలయంలో జరిగింది.
మాధవ్ మాట్లాడుతూ, బాపట్లను అమరావతితో అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బాపట్ల స్వాతంత్య్ర సమరయోధుల ప్రాంతమని కొనియాడారు. కాగా, సమావేశంలో మాధవ్ ముందుగా విలేకరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన జర్నలిస్టులు, తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లోనూ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. అలాగే, కరోనాకు ముందు జర్నలిస్టులకు రైల్వే పాసులు ఇచ్చేవారని, వాటిని తిరిగి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ రంగంలో బాపట్ల అగ్రస్థానంలో ఉండాల్సిన ప్రాంతమని, అయితే వెనుకబడటం బాధాకరమని మాధవ్ అన్నారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
అభివృద్ధిలో భాగంగా కేంద్రం కొంతవరకు నిధులు మంజూరు చేస్తోందని, కానీ రాష్ట్రం చూడాల్సిన సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరడం సరికాదని అన్నారు. దీనికి ప్రతిగా జర్నలిస్టులు, బాపట్ల జిల్లాలో బ్లాక్బెర్రీ పంట వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పొగాకు కంపెనీలతో కేంద్రానికి కూడా సంబంధాలు ఉన్నందున, ఈ విషయంలో జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు.
కేంద్రం ద్వారా రాష్ట్రంలో రూ. 9.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఐదేళ్లలో ఏది చేయగలమో అది పూర్తి చేసి, ప్రజలకు అందిస్తేనే తదుపరిసారి అవకాశం వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తారని మాధవ్ చెప్పారు. అందుకే ఆయన వేగంగా పనులు చేస్తున్నారని, రాజధాని నిర్మాణం కూడా చాలా బాగా జరుగుతోందని, దానిని సందర్శించాలని కోరారు.