– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: నేతన్న కుటుంబాలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిక వారసత్వానికి చిహ్నం మన చేనేత. నిండైన భారతీయతకు, మన అస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే నేతన్న సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నది ముమ్మాటికీ మోసమేనిని ఏపీసీసీ చీప్ వైఎస్ షర్మిలా విమర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే…
చేయూతనివాల్సిన రంగాన్ని మోడీ చేసింది నిర్వీర్యమే. చేనేత సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేంద్ర బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పి.. ముష్టి రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణం. చేనేత వస్త్రాల మీద 5 శాతం జీఎస్టి మోపి నేతన్నలకు కేంద్రం వెన్నుపోటు పొడిస్తే.. ప్రతి మగ్గానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సగానికి సగం మగ్గాలకు కోతపెట్టి చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు.
రాష్ట్రంలో 1.70 లక్షల మగ్గాలు ఉంటే కేవలం 62 వేల మగ్గాలకు మాత్రమే.. ఉచిత కరెంటు ఇచ్చి చేతులు దులుపుకోవడం దుర్మార్గపు చర్య. ఎన్నికల్లో చేనేతల కోసం ఇచ్చిన 25 హామీలను కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.చేనేత సంక్షేమాన్ని విస్మరించింది. చేనేత వస్త్రాల మీద జీఎస్టి రీయింబర్స్ మెంట్ కాదు..మొత్తం రద్దు చేయాలి. రాష్ట్రంలో చేనేత సహకార వ్యవస్థలను బలోపేతం చేయాలి. మార్కెటింగ్ సదుపాయాన్ని మెరుగుపరచాలి.
ప్రతి మగ్గానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి. చేనేతలకు సబ్సిడీ కింద బాకీ పడిన రూ.156 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ప్రతి చేనేతకు హెల్త్ కార్డ్ అందించాలి. బీమా సౌకర్యాన్ని పునరుద్ధరించాలి. చేనేతల ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి నేతన్నలకు ఉపాధి కల్పించాలి. చేనేతల రుణమాఫీ సౌకర్యం అందుబాటులోకి తేవాలి. చేనేతలకు గ్రామీణ ప్రాంతాల్లో భూములు కేటాయించి అందులో హౌజ్ కం వర్క్ షెడ్ లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి. నేతన్నలకు సరిపడా నూలును సబ్సిడీ రేట్లకు ప్రభుత్వమే అందించాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేనేతల పక్షాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.