– త్వరలో పుతిన్ భారత పర్యటన
మాస్కో:రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి భేటీ ఇరు దేశాల మధ్య బలమైన స్నేహ బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దోవల్‌తో పాటు రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు, అధ్యక్ష కార్యాలయం సహాయకుడు యూరి ఉషకోవ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించినట్లు సమాచారం.
అజిత్ దోవల్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో విడిగా కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు సంబంధించిన సన్నాహకాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన తేదీలను ఖరారు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.