– ఇవి కేవలం రోడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల ఆర్థిక జీవరేఖలు
– ప్రతి గ్రామాన్ని..మండల కేంద్రానికి,ప్రతి మండలాన్ని..జిల్లా కేంద్రానికి..ప్రతి జిల్లాను రాష్ట్ర రాజధానికి కలిపే విధంగా రోడ్ల నిర్మాణం..
– ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో 17 ప్యాకేజీలో 5190కి. మీ రోడ్లు వేయబోతున్నాం
– సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి సహకారంతో మంచి రోడ్లు వేసుకోబోతున్నాం
– సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమే కాబట్టి రోడ్లకు ప్రాధాన్యతనిస్తున్నాం
– తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం
– హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రోడ్ షో లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన NAC లో జరిగిన హ్యామ్ విధానం పై చర్చ జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు.
చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్,ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా,ఆర్ అండ్ బి అధికారులు,బ్యాంకర్లు,కాంట్రాక్టర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు.
ఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్లు వేయనున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
“అమెరికా సంపన్న దేశం కాబట్టి అమెరికా రోడ్లు బాగుండటం కాదు.. రోడ్లు బాగుండటం వల్లనే అమెరికా సంపన్న దేశంగా మారింది”- జాన్ ఎఫ్ కెన్నడీ, అమెరికా మాజీ అధ్యక్షులు
“తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే” కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రహదారుల నిర్మాణానికి పూనుకున్నాం.
ప్రజలను రహదారులతో అనుసంధానించడం, రాష్ట్ర అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు తెలంగాణ భవిష్యత్తుకు రూపకల్పన చేయడం) అనే ఆశయంతో మేం అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాం.
తెలంగాణ, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి. అయితే గత పదేండ్లలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మాత్రం “ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది”. రాష్ట్ర ఆర్థిక పురోగతి ఎంత ముఖ్యమో.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం మాకు అంతే ముఖ్యం.
ప్రతి గ్రామాన్ని.. మండల్ కేంద్రానికి, ప్రతి మండలాన్ని.. జిల్లా కేంద్రానికి,
ప్రతి జిల్లాను.. రాష్ట్ర రాజధానికి కలిపే హైవేలను నిర్మించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ కార్యక్రమంలో మొదటి దశలో:
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం 17 ప్యాకేజీలలో 7,947 కిలోమీటర్ల రోడ్డు పనులను చేపడుతుంది. రోడ్లు & భవనాల శాఖ అభివృద్ధి చేయాలని తలపెట్టిన 12 వేల కిలోమీటర్ల రహదారుల్లో మొదటి దశలో 6478.33 కోట్ల రూపాయలతో 17 ప్యాకేజీలలో 5,190 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తుంది. మిగిలిన 6810 కిలోమీటర్ల రహదారులను వచ్చే డిసెంబర్ నాటికి టెండర్లు పిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్లు, మండలాల నుండి జిల్లాలకు రెండు వరుసల రోడ్లు, మరియు గ్రామాలను కలుపుతూ అన్ని వాతావరణాలకు అనుకూలమైన రోడ్లను బలోపేతం చేయడమే మా వ్యూహాత్మక ప్రణాళిక. అనుసంధానం లేని గ్రామ పంచాయతీ రోడ్లను మెరుగుపరచడం మరియు మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.
. హ్యామ్ విధానంలో ప్రభుత్వం 40% నిధులు 4% చొప్పున 10 వాయిదాలలో చెల్లిస్తుంది. ఇందులో కేవలం 10% నిధులు మాత్రమే అడ్వాన్స్ గా చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. మిగిలిన 60% పెట్టుబడిని కాంట్రాక్టు సంస్థ పెట్టుబడిగా పెడుతుంది, వారి పనితీరు ఆధారంగా ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది.
ఈ విధానంలో టోకు ధరల సూచీ వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు సర్దుబాటు చేస్తుంది. ఈ విధానంలో పెట్టుబడిదారులకు స్థిరత్వం, తక్కువ రిస్క్ ఉంటుంది. ప్రజలకు ప్రమాదరహిత రహదారుల నిర్మాణం జరగడంతో పాటుగా.. 15 సంవత్సరాల పాటు నాణ్యమైన రహదారుల నిర్వహణ జరుగుతుంది.
కాంట్రాక్టర్లు మరియు పెట్టుబడిదారులకు తక్కువ రిస్క్, స్థిర ఆదాయం, మరియు ఇవి NHAI ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకులు ఫైనాన్స్ చేసే ప్రాజెక్టులు. సామాన్య ప్రజలకు మెరుగైన రోడ్డు అనుసంధానం, వేగవంతమైన ప్రయాణం, సురక్షితమైన రోడ్లు, మరియు స్థానిక వ్యాపారం, పర్యాటకం, జీవనోపాధికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇవి కేవలం రోడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఆర్థిక జీవరేఖలు.
మా ప్రభుత్వం పారదర్శకత, వేగం మరియు భాగస్వామ్య విధానాలకు కట్టుబడి ఉంది. సకాలంలో చెల్లింపులు, స్పష్టమైన విధానాలు మరియు చక్కటి సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తూ, ఈ ప్రాజెక్టులో భాగమైన ప్రతీ సంస్థకు దీర్ఘకాలిక విలువలతో స్థిరమైన భాగస్వాములం కావడమే మా లక్ష్యం. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఈ రోడ్ షో ఒక అవకాశం అని నా అభిప్రాయం.
ఒక్కసారి ఈ రహదారుల నిర్మాణం ప్రారంభం అయితే సదరు సంస్థలే.. రహదారులను నిర్వహిస్తూ.. గుంతలు పూడ్చడం, పగుళ్లు మూసివేయడం, సైన్‌బోర్డులు, కాలువలు, మరియు లైటింగ్ వంటివి నిర్వహిస్తారు కాబట్టి ప్రమాదాలు తగ్గుతాయనే ఆశాభావంతో ఉన్నాను.
ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం “నమ్మకమైన రోడ్లు ప్రమాదాలు లేని రహదారులను నిర్మించడమే కాదు”, ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతీ సంస్థకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ ప్రాజెక్టు అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు “TG రోడ్స్ ఇన్వెంటరీ” అనే వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాదు, రహదారుల నాణ్యత, నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేస్తాం.
ఈ హ్యామ్ ప్రాజెక్ట్ గ్రామీణ మరియు ప్రాంతీయ అభివృద్ధికి, మరియు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.