– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర కార్యాలయం వద్ద ఎంహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ అధ్యక్షతన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్, విశిష్ట అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ముస్లింలు ఈదేశ అంతర్భాగమని అనేకమంది ముస్లింలు దేశ స్వాతంత్ర ఉద్యమంలో అసువులుబాసారని తెలిపారు. హిందూ ముస్లింల ఐక్యతతో ఈదేశానికి స్వాతంత్య్రం లభించిందని, ఒకరి ఆచార వ్యవహారాలను మరొకరు గౌరవించుకునే సంప్రదాయం మనది అని అన్నారు. ఈ సందర్భంగా అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ పాత్రను ఆయన గుర్తు చేశారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్ మాట్లాడుతూ ఎంహెచ్పీఎస్ నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలిసిన గాంధీ, నెహ్రూ, పటేల్ గురించి మాత్రమే కాకుండా ఇంత మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల గురించి తెలిసిందని, వీరి గురించి మొత్తం దేశానికి తెలిసే విధంగా మనమందరం కృషి చేయాలని కోరారు.
ఈ వేడుకను ఘనంగా నిర్వహించిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ ప్రగతికి మూలమంత్రం అని, దేశ విభజన నాడు ముస్లింలకు పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉన్నా ఆ ప్రతిపాదనను తిరస్కరించి భారత దేశం మా మాతృభూమి అని తమ దేశభక్తిని చాటుకున్న వారి సంతతి మేం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మదరసా విద్యార్థులు, ముస్లిం మహిళలు పాల్గొన్నారు. 25 కేజీల భారీ కేక్, ముస్లిం స్వాతంత్ర సమరయోధుల లైట్ వాకర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, ఎంహెచ్పీఎస్ సెక్రెటరీ సయ్యద్ అర్షద్, న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది ఎండి సలీం పాషా, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు, ఎంహెచ్పీఎస్ మీడియా కోఆర్డినేటర్ మోయిన్ అబ్దుల్ గఫూర్, ఎంహెచ్పీఎస్ మహిళా విభాగం నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.