ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్న విషయం గమనిస్తే మన పాలకుల వైఫల్యం ఎలా ఉంటుందో అర్థమవుతున్నది. పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా పులివెందులలో ఓట్లు వేయటానికి జనం బారులు తీరినదానిని మేడల మీద నుండి, మిద్దెల మీద నుండి గమనించటం విచిత్రమనిపించింది.
కారణం వింటే బాధ కలుగుతున్నది. 30 సంవత్సరాలుగా పులివెందుల జెడ్పీటీసీ కి ఎన్నిక జరగవలసిన అవసరం కలగలేదు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. వైఎస్ కుటుంబం ఎవరిని నిర్ణయిస్తే వారే జిల్లా పరిషత్ మెంబర్, వైఎస్ కుటుంబం ఎవరిపేరు రాస్తే వారే మండల పరిషత్ మెంబర్. ఇక సర్పంచుల గురించి చెప్పనే అవసరం లేదంటున్నారు.
నిన్నటి ఎన్నికలో కూడా కొంతమంది బయటకు వచ్చి ఓటు వేయటానికి భయపడ్డారని చెబుతున్నారు. భయపడుతున్నాము అని చెప్పిన వారికి ఎస్కార్ట్ కలిపించమని ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్కార్ట్ కలిపించినా కూడా కొంతమంది ఓటు వేయటానికి రాలేదు అంటే పులివెందుల భయం గుప్పిట్లో ఉందని అర్ధమవుతున్నది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు వెయ్యటానికి భయపడే పరిస్థితి వుండటం అంటే, దానిని ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ అనాలో, రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూర్ అనాలో అర్ధం కావటంలేదు.
అన్నింటినీ మించి కేంద్రప్రభుత్వం తన దృష్టిని ఎందుకు సారించలేదో తెలియదు. ఇటువంటి సంఘటనలు ప్రపంచదేశాల ముందు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తలదించుకునే పరిస్థితిని కల్పిస్తున్నాయి. పులివెందుల అనేది అంత అభేద్యమైన కోటగా ఎలా మారింది.? వైఎస్ కుటుంబం ఆ కోటకు తమను తాము చక్రవర్తులుగా ప్రకటించుకునే పరిస్థితి ఎవరు కలిపించారు.?
కడప జిల్లాలో వైఎస్ కుటుంబం సాగించిన అరాచకాలను అడ్డుకొనే ప్రయత్నం ఏ ప్రభుత్వమూ చెయ్యలేకపోవటం మాత్రం పులివెందుల ప్రజలు క్షమించకూడని విషయం. ఒక ప్రభుత్వం తలచుకుంటే ప్రజల ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాపాడగలదని అర్థమవుతున్నది.
చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాలేదు. కానీ నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వెంకటేశ్వరస్వామికి తొలిగడపగా పేరొందిన కడపను, కడపలో పెరిగిపోయిన ఫ్యాక్షనిజాన్ని ఎందుకు పట్టించుకోలేదు.?
రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందే జగన్ చేసిన ఒకటి రెండు దందాలు బయట పడినప్పుడు అవి వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా చంద్రబాబు సహాయపడ్డాడు అనే కథనాలు వినిపించాయి. బహుశా మిత్రుడిపైన ప్రేమతో పాటు, భవిష్యత్తులో పైకి రావలసిన యువకుడిని కాపాడుదాము అనుకుని ఉండవచ్చు.
కానీ కడపలో పెరిగిపోతున్న అరాచకాన్ని కూడా పట్టించుకోకపోవటం జీర్ణించుకోగలిగే విషయం మాత్రం కాదు. హైదరాబాదులో మతకల్లోలాలు ఎలా వుండేవో తెలియనిది కాదు. హైదరాబాద్ మతకల్లోలాల వెనుక రాజకీయ నాయకుల అధికార దాహం అనే రాక్షసక్రీడ వుండేది. రాజకీయ ప్రేరేపిత మతకల్లోలాలు కూడా తరచుగా కనిపించేవి. కళాశాలలు, ఆఫీసులు ఆరునెలలే పనిచేస్తుండేవి. అటువంటి మతకల్లోలాలతో పోలిస్తే కడపలో వైయస్ కుటుంబం లెక్కలోది కాదు.
దశాబ్దాలుగా హైదరాబాద్ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన మతకల్లోలాలను టీడీపీ ప్రభుత్వం సంపూర్ణంగా తుడిచి పెట్టగలిగింది; కానీ కడప, ముఖ్యంగా పులివెందుల అరాచకాలను అరికట్టగలిగినా చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరించారు అనేది మాత్రం వాస్తవం. అందుకు కారణం వైఎస్ తో ఆయనకున్న స్నేహమన్నా కావాలి, ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం అయిన పులివెందులలో తలదూర్చటం భావ్యం కాదు అని భావించడం అయినా కావాలి.
చంద్రబాబు చూపించిన అటువంటి సంస్కారం రాష్ట్రంలో అరాచక శక్తులు పెరగటానికి దోహదపడింది. నిన్న జరిగిన ఉపఎన్నికలు గమనిస్తే చంద్రబాబు మోహరించిన టీమ్.. చంద్రబాబుకు కొత్త టీమ్ ఏమీ కాదు. వారందరూ ఎప్పటినుండో అరాచకవాదులను ఎదుర్కుంటూ తెలుగుదేశం పార్టీ జెండాని ఎగుర వేసిన వారే. అనేక రకాలుగా హత్యాచారాలను ఎదుర్కొన్నవారే. వారిని కూడా సంయమనం పాటించమని చంద్రబాబు మందలిస్తూనే ఉంటారు.
ఆయన సంస్కారం ఒప్పుకోతగినదే కానీ పోరాడక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు పోరాడితీరాలి. కూటమి ప్రభుత్వం ఈ ఉపఎన్నికను నారా లోకేష్ దిశా నిర్దేశంలో ఎదుర్కొన్నారు అనే వార్త వినిపిస్తున్నది. ప్రజాస్వామిక హక్కులకు దూరంగా ఉంచబడిన ప్రజలను ప్రజాస్వామిక జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు లోకేష్ చేసిన కృషి అభినందనీయం.
పోలీసు యంత్రాంగం నిజాయితీగా తమ బాధ్యతలను నిర్వర్తించాలనుకుంటే, యూనిఫాం గౌరవాన్ని కాపాడాలనుకుంటే ఒక పోలీసు ఆఫీసర్ కు అసాధ్యమనేది వుండదని డీఐజీ కోయ ప్రవీణ్ నిరూపించాడు. 30 సంవత్సరాల అరాచకాన్ని బద్దలు కొట్టటంలో ప్రధానపాత్ర పోషించిన డీఐజీ ప్రవీణ్ తన సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి వచ్చి విఫలమై వెనుతిరిగిన సీబీఐ ఒక్కసారి రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా కోయ ప్రవీణ్ లాంటి ఆఫీసర్లను చూసి నేర్చుకుంటే వైఫల్యాలతో వచ్చే అవమానాలకు దూరంగా ఉండవచ్చు. పోలీసు యంత్రాంగాన్ని అరాచకాలకు మాత్రమే ఉపయోగించుకునే వారికి కోయ ప్రవీణ్ లాంటి వాళ్ళు శత్రువులులా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో రాష్ట్ర పోలీసుయంత్రాంగం తమదైన బాధ్యతను నిర్వర్తించినందుకు వారందరినీ అభినందించవలసినదే. ఎన్నికల్లో ప్రధానంగా కనిపించింది కూటమి ఐక్యత. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేసిన ఎన్కౌంటర్ నుండి మీడియా సాయంతో తప్పించుకోగలిగాడు బీటెక్ రవి. మొన్నటి శాసనసభా ఎన్నికలలో జగన్ ను ఢీకొన్న వ్యక్తి. పులివెందుల జెడ్పీటీసీ కి పోటీ చేసింది లతారెడ్డి, బీటెక్ రవి శ్రీమతి.
ప్రచార బాధ్యతను స్వీకరించిన ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాధవీరెడ్డి, సవిత, రాంప్రసాద్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి చివరిగా బీటెక్ రవి. ఎన్నికల ప్రచారం అనేది, ప్రతివారూ తమ శక్తినంతా ధారపోయటం స్పష్టంగా కనిపించింది. ఎవరింటిలోనో పెళ్ళికో, పేరంటానికో వెళ్ళినంత ఆహ్లాదకరంగా ఉంది. ఐక్యతా రాగానికి శక్తియుక్తులను మేళవించి చేసిన ప్రచారం బహుశా పులివెందుల ప్రజల ఆలోచనను ఎంతో కొంత మార్చగలిగినా ఫలితం కూటమికి అనుకూలంగా వుండే అవకాశం వుంది.
గెలుపు ఓటమికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. ముఖ్యంగా కూటమికి ఈ ఎన్నిక వలన ప్రత్యేకంగా ఒరిగేదేమి ఉండదు. పులివెందులలో పదిమంది నామినేషన్లు వేశారు, ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగింది, అంటే ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం జరిగింది. కూటమికి విజయమంటే అదే. గెలుపు అనేది బోనస్ మాత్రమే.
కూటమి ఐక్యతకు మాత్రం బలం చేకూరుస్తుంది. జగన్ ఓట్ బ్యాంకు బలాలు, బలహీనతలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్థానికసంస్థల ఎన్నికలలో ప్రతిబింబించేది ప్రజల అవసరాలు. ఒక్కో దగ్గర ఒక్కో రకపు సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రజలు వారి వారి అవసరాలను బట్టి స్పందిస్తూ ఉంటారు. పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారికి పట్టాభిషేకం చేసినందుకు అభినందించాల్సిందే. ఇదే స్ఫూర్తి భవిష్యత్తుల్లోనూ కొనసాగిస్తే, ప్రజాస్వామ్యం పులివెందులో తిష్టవేయడం ఖాయం.
– ఇంద్రాణి