(నవీన్)
ఓట్ల గల్లంతులో రెండు కీలకమైన అంశాలు వున్నాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్లు అకారణంగా తొలగించడం ఒక సమస్య. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలు రావడం మరో తీవ్రమైన ఆరోపణ.
రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే లేవనెత్తుతున్న ‘ఓట్ల గల్లంతు’ వివాదం భారత రాజకీయాల్లో తుఫానుగా మారుతోంది. ఇది కేవలం ఎన్నికల సంఘం పనితీరుపై విమర్శ కాదు. ఇది ఒక పకడ్బందీ రాజకీయ వ్యూహం. అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సంధించిన పదునైన అస్త్రం.
రాజ్యాంగ వ్యవస్థల పతనమనే తమ వాదనకు ఈ ఆరోపణలను కాంగ్రెస్ బలంగా ముడిపెడుతోంది. అయితే ఈ ప్రభావం ఉత్తరాది రాష్ట్రల్లో వున్నంత బలంగా దక్షిణాది రాష్ట్రల్లో ఉండక పోవచ్చు.
ఓట్ల గల్లంతు ఫిర్యాదులు దేశవ్యాప్తంగా వున్నాయి. ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయని గతంలో వార్తలు వచ్చాయి. ఇది కేవలం ఉద్యోగ యంత్రాంగం పొరపాటా? లేక ఉద్దేశపూర్వక కుట్రా అనే సందేహాహలకు ఖచ్చితమైన సమాధానాలు లేవు.
ముఖ్యంగా, పోలింగ్ ముగిశాక ఇచ్చే ఫారం 17C లెక్కలకు, తుది లెక్కింపునకు మధ్య తేడాలు రావడం వివాదాన్ని మరింత జఠిలం చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో వందలాది నియోజకవర్గాల్లో ఇలాంటి తేడాలు ఉన్నాయని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నివేదించాయి. దీనిపై ఎన్నికల సంఘం ఇచ్చే సాంకేతిక వివరణలు ప్రజల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నాయి.
“ఓట్లు మాయమయ్యాయి” అనే సరళమైన, భావోద్వేగపూరితమైన ఆరోపణ ముందు, ఎన్నికల సంఘం ఇచ్చే సంక్లిష్టమైన వివరణలు తేలిపోతున్నాయి. విశ్వసనీయతలో ఈ లోపాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.
ఉత్తరాదిలో ఈ వివాదం కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరుగా కనిపిస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తి భిన్నం. ఇక్కడ ఈ ఆరోపణలు స్థానిక రాజకీయాల రంగు పులుముకున్నాయి.
కర్ణాటకలో ‘చిలుమే’ కుంభకోణం రూపంలో ఈ వివాదం బయటపడింది. ఓటర్ల సమాచారాన్ని ఒక ప్రైవేటు సంస్థ దొంగిలించిందని కాంగ్రెస్, నాటి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది.
తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 22 లక్షల ఓట్లు గల్లంతవడం పెను దుమారం రేపింది. అప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ ఒకరిపై మరొకరు ఓట్ల తొలగింపు ఆరోపణలు చేసుకుంటున్నాయి. వాలంటీర్ల వ్యవస్థను వాడుకుని దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని, ప్రత్యర్థుల ఓట్లు తొలగిస్తున్నారని పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల కూటముల మధ్యే ప్రధాన పోటీ. ఇక్కడ జాతీయ స్థాయి ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఏవైనా ఎన్నికల అవకతవకలు జరిగితే, ఆ నింద స్థానిక ప్రత్యర్థులపైనే పడుతుంది.
దీనిని బట్టి దక్షిణాదిలో ‘ఓట్ల గల్లంతు’ ఆరోపణలు ‘ఫెడరల్’ స్వభావాన్ని సంతరించుకున్నాయని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది రాహుల్ గాంధీ జాతీయ వ్యూహానికి ఒకరకంగా అవరోధమే. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఒకే గొంతుక వినిపించాలన్న ఆయన లక్ష్యం, ఇలా ప్రాంతీయంగా చీలిపోతోంది.
ఈ వివాదాన్ని రాహుల్ గాంధీ ఎందుకు ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు? దీని వెనుక స్పష్టమైన రాజకీయ సమీకరణాలున్నాయి. మొదటగా, ఇది పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతుంది. ఓటర్ల నమోదు, బూత్ స్థాయి పర్యవేక్షణ వంటి సాధారణ పనులను ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ఉద్యమంగా మార్చి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తుంది.
రెండవది, ఇది విపక్షాల ఐక్యతకు ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది. నాయకత్వం, సీట్ల పంపకాల వంటి క్లిష్టమైన అంశాల కన్నా, ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించడం ద్వారా బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడం సులభం.
అంతకన్నా ముఖ్యంగా, ఇది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ నాయకత్వానికి ఒక రాజకీయ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఒకవేళ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే, అది తమ వైఫల్యం కాదని, ఎన్నికల ప్రక్రియలోనే మోసం జరిగిందని చెప్పేందుకు వీలు కల్పిస్తుంది. ఇది నాయకత్వాన్ని జవాబుదారీతనం నుంచి కాపాడుతుంది. అయితే, ఈ వ్యూహం పార్టీకి దీర్ఘకాలంలో నష్టం చేయొచ్చు. స్వీయ విశ్లేషణ, సంస్థాగత మార్పుల బదులు, ఓటమికి కారణాలను బయట వెతకడం అలవాటుగా మారే ప్రమాదం ఉంది.
ఓట్ల గల్లంతు ఆరోపణలు కాంగ్రెస్కు స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు చేకూర్చవచ్చు. కానీ దీని దీర్ఘకాలిక ప్రభావం భారత ప్రజాస్వామ్యంపై తీవ్రంగా ఉంటుంది. అమెరికాలో “స్టాప్ ది స్టీల్” ఉద్యమంలా, ఓటమిని అంగీకరించని సంస్కృతి ఇక్కడ కూడా పాతుకుపోయే ప్రమాదం ఉంది. గెలిస్తే ప్రజాతీర్పు అని, ఓడితే కుట్ర అని వాదించడం ఒక ఆనవాయితీగా మారితే, అది ఎన్నికల వ్యవస్థ మూలాలనే దెబ్బతీస్తుంది.
ఈ వివాదంలో అంతిమంగా నష్టపోయేది బీజేపీయో, కాంగ్రెసో కాదు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై, ఓటు అనే పవిత్ర హక్కుపై సామాన్య పౌరుడికి సన్నగిల్లుతున్న విశ్వాసం. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన పరిణామం.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)