– శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర దుర్ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్ : ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో అయిదుగురు మరణించడం, మరికొంతమంది గాయపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మరో 100 మీటర్ల దూరంలో శోభయాత్ర ముగుస్తుందనగా ఘటన జరగడం దురదృష్టకరం.
కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశాం. దర్యాప్తు నివేదిక వచ్చాకా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశాం