– 7 గురు ఎమ్మెల్యేల నిర్వాకంపై బాబు సీరియస్
– విపక్షానికి మీరే ఆయుధాలిస్తారా?
– క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదు
– క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు హెచ్చరిక
– అంతకుముందు బ్రేక్‌ఫాస్ట్ మీటింగులో లోకేష్ హితవు
– పెరోల్‌పై జాగ్రత్తగా ఉండాలని అనితకు సూచన
– పులివెందుల విజయ సంతోషంలో ఏమిటివి?
– బాబు సీరియస్‌గా ఉన్నారన్న లోకేష్
– 23న మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలతో బాబు భేటీ
విజయవాడ: పార్టీని అప్రతిష్ఠపాలు చేస్తూ క్రమశిక్షణ కట్టుతప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబునాయుడు కన్నెర్ర చేశారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, ఇకనయినా అలాంటివారు పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.
ప్రధానంగా కొద్దిరోజుల నుంచి మీడియా-సోషల్‌మీడియాలో రచ్చ అయి, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిన 7 గురు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత విహ స్తారు? జిల్లా మంత్రులు మీ జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడండి. రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా తయారయింది. వారితో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండకపోతే మీరే నష్టపోతారని బాబు స్పష్టం చేశారు.
అంతకుముందు మంత్రులతో ఉదయం నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ భేటీలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. ప్రధానంగా శ్రీకాంత్ పెరొల్ వ్యవహారంపై చర్చకు వచ్చింది. ఇకపై పెరోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సిఫార్సుల విషయంలో ఎమ్మెల్యేలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని లోకేష్ సూచించారు. లేడీడాన్ అరుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించిన లోకేష్.. ఎమ్మెల్యేల అతి చేష్టలు, వారిపై వస్తున్న ఆరోపణలపై బాబు సీరియస్‌గా ఉన్నారని లోకేష్ మంత్రులకు వెల్లడించారు.
అందుకే ఈనెల 23న మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలతో బాబు భేటీ అవుతారని వారికి చెప్పారు. మహానాడు తర్వాత వేయనున్న జిల్లా కమిటీలతో పాటు, నామినేటెడ్ పదవులపై కూడా వారితో మాట్లాడతారని లోకేష్ వివరించినట్లు సమాచారం. పులివెందులలో సాధించిన అద్భుత విజయాన్ని ఆస్వాదించి, దానిని కింది స్థాయికి స్ఫూర్తిగా తీసుకువెళ్లాల్సిన సమయంలో, ఇలాంటి వివాదాలు తలెత్తి కొందరు ఎమ్మెల్యేలు గీత దాటడంపై పార్టీ అదినేత చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు లోకేష్ సహచర మంత్రులకు వె ల్లడించారు.