భారతదేశ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఆకస్మిక రాజీనామా సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్లమెంట్ వర్షా కాల సమావేశాల మొదటి రోజే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన రాజీనామాను భారత రాజ్యాంగం లోని అధికరణం 67(a) క్రింద, రాష్ట్రపతికి పంపారు.
ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఐదు సంవత్సరాలు కాగా, ఆగష్టు 11, 2022 నాడు పదవీబాధ్యతలు తీసుకున్న జగదీప్ ధన్కర్ కు ఆగష్టు 2027 వరకు పదవిలో కొనసాగే అవకాశముంది. కాగా, ‘ అనారోగ్య ‘ కారణాలతో అకస్మాత్తుగా రాజీనామా చేయటం, దానిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదించటం అన్నీ వేగంగా జరిగిపోయాయి. రాజీనామాతో ఖాళీ అయిన ఈ పదవికి రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన వెలువడించింది.
పదవీకాలం పూర్తి అవ్వకుండా రాజీనామా చేసిన ఉప రాష్ట్రపతులు :
వరాహగిరి వెంకటగిరి (వి.వి.గిరి) పదవీ కాలం పూర్తి అవ్వకుండానే రాజీనామా చేసిన మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి.(13 May 1967 – 03 May 1969).
రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ హఠాన్మరణంతో తన పదవికి రాజీనామా చేసిన ఆపద్ధర్మ రాష్ట్రపతిగా కొనసాగారు.
రామస్వామి వెంకటరామన్ సైతం అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైలు సింగ్ హఠాన్మరణం తో తన ఉప రాష్ట్రపతి పదవికి (31 August 1984 – 24 July 1987) రాజీనామా చేయవలసి వచ్చింది. పిదప దేశ 8 వ రాష్ట్రపతిగా ఎన్నికై ఈ దేశానికి విశిష్ఠ సేవలందించారు.
2014 వ సంవత్సరంలో కేంద్రంలో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసున్నప్పటి నుండి నేటి మాజీ ఉప రాష్ట్రపతి జగదేవ్ ధన్కర్ అర్ధాంతర రాజీనామా సహా మరికొంత మంది ప్రముఖులను ఇక్కడ గుర్తుచేసుకోవాలి.
రఘురాం రాజన్, RBI గవర్నర్ (2013-2016), ఉర్జిత్ పటేల్, RBI గవర్నర్ (2016-2018), వైరల్ ఆచార్య, RBI డిప్యూటీ గవర్నర్ (2017-2019), అరవింద్ సుబ్రమణియన్, ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారుడు (2014-2018), అశోక్ లావాసా, భారత ఎన్నికల కమిషనర్ (2018-2020), అరుణ్ గోయల్, భారత ఎన్నికల కమీషనర్ (2022-2024). స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థలలో ప్రభుత్వం మితిమీరిన జోక్యాన్ని సహించని కారణం చేత ఈ ఉన్నతాధికారులు తమ పదవీకాలం పూర్తవకుండానే రాజీనామా చేయవలసి వచ్చింది.
‘ సంఘ ‘ ప్రచారకుడికి – న్యాయ కోవిదుడికి మధ్య పోటీ !
అధికార, ప్రతిపక్ష కూటములు ఈ పదవికి అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించటంతో హస్తిన వేదికగా దేశ 17వ ద్వితీయ పౌరుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది.
ఇప్పటికే అధికార NDA కూటమి ప్రతిపక్ష INDIA కూటమి తమ అభ్యర్థులను ప్రకటించటం, వారు నామినేషన్ దాఖలు చేయటం అందరికీ తెలిసిందే. NDA అభ్యర్థిగా సి.పి.రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయగా, INDIA కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేశారు.
సి.పి.రాధాకృష్ణన్ :
చంద్రపురం.పొన్నుసామి.రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రంలో గౌండర్ (OBC) కులంలో జన్మించారు. తన 16 వ ఏటనే RSS కార్యకర్తగా చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ లో చేరి రాష్ట్ర అధ్యక్షుడి (2004-2007) స్థాయికి ఎదిగారు.
కోయంబత్తూర్ లోక్ సభ స్థానం నుండి రెండు సార్లు (1998,1999) పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గతంలో ఝార్ఖండ్ గవర్నర్ గాను, తెలంగాణ మరియు పుదుచ్చేరి కు అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కలదు. ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్ హోదాలో సేవలందిస్తున్నారు.
జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి:
బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా లోని ఆకుల మైలారం అనే గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1971 వ సంవత్సరంలో న్యాయ శాస్త్రంలో పట్టాపొందారు . ప్రభుత్వ న్యాయవాదిగా రాష్ట్ర ప్రభుత్వంలోను, కేంద్ర ప్రభుత్వంలోనూ సేవలందించారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా (1995-2005) మధ్య కాలంలో, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (2005-2007) మధ్య కాలంలో మరియు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి గ (2007-2011) మధ్య కాలంలో తన విశేష సేవలందించారు.
సల్వా జుడుం కేసు తీర్పు, నల్ల ధనం కేసులలో అయన ఇచ్చిన తీర్పు పేరెన్నికగన్నవి. పౌరుల హక్కులు, స్వేచ్ఛకు సంబంధించిన వ్యాజ్యాలలో సానుకూల తీర్పులిచ్చిన చరిత్ర కలదు.
పదవీ విరమణ అనంతరం గోవా లోకాయుక్త గా, తెలంగాణ రాష్ట్ర కుల గణన కమిటీ కు చైర్మన్ గా వ్యవహరించారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రానికి జీవిత కాలపు ట్రస్టీ గా వ్యవహరిస్తున్నారు.
స్వాతంత్ర భారత చరిత్రలో, ఉప రాష్ట్రపతి పదవికి దక్షిణ భారత దేశం నుండే ఇద్దరు పోటీపడటం ఇదే ప్రధమం. దక్షిణాదిన తన ప్రాబల్యాన్ని పెంచుకొనే లక్ష్యంతో బీజేపీ తన పావులను కదుపుతోంది.
వచ్చే సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళ వాదానికి అమిత ప్రాధాన్యత ఇచ్చే ద్రవిడ పార్టీలు తమ అభ్యర్ధికి మద్దతు ఖచ్చితంగా లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. మరో పక్క కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తెలంగాణ రాష్ట్రానికి చెందిన, రాజకీయాలకు సంబంధంలేని న్యాయకోవిదుడిని నిలబెట్టి, అందరినీ ఆశ్చర్యపరచింది.
తెలుగు రాష్ట్రాలపైనే అందరి దృష్ఠి
తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు భాష అని వల్లే వేసే తెలుగుదేశం పార్టీ తన ఆత్మాభిమానాన్ని చాటుకునే సమయం ఆసన్నమైందని తెలుగు జాతి ఆత్మాభిమానులు కోరుకుంటున్నారు.కాలం నాడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నంద్యాల పార్లమెంటు ఎన్నికలలో చూపిన చొరవని ఈ తరానికి గుర్తుచేస్తున్నారు. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు నంద్యాల పార్లమెంటు ఉప ఎన్నికకు పోటీపడుతున్నారు.
మన వాడు, తెలుగు వాడు, దేశ ప్రధాని కాబోతున్నాడు అనే ఒకే కారణం చేత, ఆనాడు ఎన్టీఆర్ తమ అభ్యర్థిని పోటీకి పెట్టలేదు.
చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం మొన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కావటానికి చూపిన చొరవ, ఉత్సాహం అందరికీ తెలిసిందే. మరి ఆ తెగువ, సాహసం ఈ సారికూడా ప్రదర్శించాలని తెలుగుజాతి కోరుకుంటుంది. ?
అన్నయ్య కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి హోదా అనుభవించినప్పటికీ, ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా, తమ్ముడు పోటీలో ఉన్నాడు కనుక తాను జనసేనకే మద్దతు ఇస్తానని చెప్పటంతో, 2024 అసెంబ్లీ ఎన్నికలలో ‘ జాతి ‘ మొత్తం పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చింది. మరి తెలుగు జాతీయుడు ఉప రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ఈ తరుణంలో జనసేనాని అదే స్ఫూర్తిని కనబరుస్తాడా. ?
పదుల సంఖ్యలో కేసులున్నప్పటికీ, తనపై విచారణ సంస్థల దర్యాప్తు మందకొడిగా సాగటంలో కేంద్ర బీజేపీ మద్దతు సంపూర్ణంగా ఉన్నదని జగన్మోహన్ రెడ్డి విశ్వసిస్తున్నారు. గతంలో పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు షరతులు లేని మద్దతు తెలిపిన విధంగానే ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు ఇస్తాడా? లేక ఆత్మప్రభోదాను సారం తన నిర్ణయాన్ని ఈ సారికి మార్చుకొంటాడా ?
గమనిక : YSRCP రాజ్యసభ సభ్యుడు రఘునాధ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ను ఆగష్టు 21 వ తేదీ నాడు మర్యాదపూర్వకంగా కలిశారు.
పరాయి పాలనకు స్వస్తి చెప్పి, తెలంగాణ నినాదాన్ని గొంతెత్తి, తెలంగాణ వాదమే ప్రజల అభిమతమని ఎలుగెత్తిన కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయాన్ని, తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. తెలంగాణ బిడ్డ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి కి మద్దతు ఇచ్చి, తాను నిజమైన తెలంగాణవాదినని నిరూపించుకుంటాడా ? లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది !
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత సాధారణమో, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అభ్యర్థులు పోటీ పడటం అంతే సర్వ సాధారణం. ఉభయ సభలలో అధికార NDA కి సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఫలితాలు ఏకపక్షంగా ఉండవని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యనే ఢిల్లీలో జరిగిన ప్రతిష్ఠాత్మక CONSTITUTIONAL CLUB OF INDIA ఎన్నికలు అందుకు నిదర్శనం అంటున్నారు.
ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులు కీలకమైన సెక్రటరీ ని ఎన్నుకొనే ఈ ఎన్నికలలో బీజేపీ కే చెందిన ఇద్దరు ప్రస్తుత పార్లమెంటు సభ్యులు పోటీపడ్డారు. రాజీవ్ ప్రతాప్ రూడీ తన ప్రత్యర్థి సంజీవ్ బల్యాన్ పై విజయం సాధించి, 25 సంవత్సరాల సంప్రదాయాన్ని పటాపంచలు చేసారు. ఈ ఎన్నిక బీజేపీ లోని ‘ ఇద్దరు ‘ గుత్తాధిపత్యాన్ని సవాలు చెయ్యటమే కాకుండా (All is not well) అనే సంకేతాన్ని పంపింది.
పార్లమెంటు లోపలా, బయటా వోట్ చోర్ నినాదాలు హోరెత్తుతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పార్లమెంటు సభ్యులు తమ ఆత్మ ప్రభోదానుసారం ఓటు హక్కును వినియోగించుకుంటే కనుక ఫలితాలు తారుమారు అవుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
మొత్తంగా సెప్టెంబర్ 9 వ తేదీ నాడు, దేశ ప్రతిష్టాత్మక 17 వ ఉప రాష్ట్రపతి పదవికి జరిగే ఈ ఎన్నికలలో, ప్రజాప్రతినిధులు ‘ సంఘ ‘నాయకుడికి అవకాశం కల్పిస్తారో ? లేక ఒక న్యాయ కోవిదుడికి పట్టం కడతారో చూడాలి.
– సోమశేఖర్ వడ్డి
( న్యాయవాది)