– క్వింటా 200 రూ నుండి 600 రూ..
– కర్నూల్ మార్కెట్ యార్డ్ లో రైతుల ఆర్తనాదాలు
– ఎంవీఎస్ నాగిరెడ్డి
కర్నూలు: ఖరీఫ్ లో మొట్ట మొదట మార్కెట్ కు వచ్చే పంట ఉల్లి. దాదాపుగా రాష్ట్రం అంతటికి ఉల్లి అందించేది కర్నూల్ జిల్లా రైతులే. ఉల్లి సాగు చేసేది కవులు రైతులు, చిన్న.. చిన్న రైతులు. కర్నూల్ మార్కెట్ లోని రైతులను చూస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కనీస పెట్టుబడి కూడా రాకుండా డిస్ట్రెస్ సేల్ కు అమ్ముకుంటే రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనికి వెళతారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మార్కెటింగ్ శాఖ ద్వారా కర్నూల్ మార్కెట్ యార్డ్ లో ఉల్లిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తం ఉన్న రైతు బజార్ లలో రిటైల్ గా అమ్మేలా చర్య తీసుకోండి.. ఇలా చేస్తే మార్కెట్ యార్డ్ లో పోటీ పెరిగి వ్యాపారస్తులు కనీస మద్దతు ధర కంటే పైన కొనే పరిస్థితి వస్తుందన్నారు. తద్వారా రైతుకు లాభం రాకపోయినా కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తే ఆర్థిక సంక్షోభంలోనికి వెళ్ళకుండా ఉంటాడని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కర్నూల్ మార్కెట్ యార్డ్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో ఉల్లిని కొని నో ప్రాఫిట్..నో లాస్ మీద రాష్ట్రం లోని రైతు బజార్ లు అన్నిటిలో సేల్ కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మేలా చర్యలు తీసుకోమని మా డైరెక్టర్ నుండి మెమో వచ్చింది.. అందుకు అనుగుణంగానే 10 టన్నులు విజయవాడ మార్కెట్ కు పంపిస్తున్నామని చెప్పారు.
కానీ మార్కెట్ లో చూస్తే కనీస మద్దతు ధర ప్రకటించకుండా బిడ్డింగ్ లో వస్తున్న 200 నుండి 600 రూ వీళ్ళు కొంటున్నారు.. ఇది చాలా అన్యాయమని నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
డెల్టాలో ఎక్కడ రైతు బజార్ లలో చూసినా ఉల్లి ధర కిలో 24 నుండి 26 రూపాయలు ఉన్నది. గుడివాడ రైతు బజార్ లో బోర్డు మీద ఉల్లిపాయలు కిలో 26 రూ. ఉంది… స్వయంగా నేను చుసిన ధర. రైతు బజార్ లో 26 రూ.లు అమ్ముతుంటే క్వింటా 500 నుండి 600 రూ.కి కర్నూల్ మార్కెట్ యార్డ్ లో మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయడం.. నో ప్రాఫిట్..నో లాస్ కు చేయడమా అని ఆయన ప్రశ్నించారు. దయచేసి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఉల్లి రైతును కొద్దిగా అయినా ఆదుకునేలా కనీస మద్దతు ధరను ప్రకటించి ఆ ధర కు కొనుగోలు చేయండి. సీజన్ మొదటి లోనేసరి అయినా చర్య తీసుకోకపోతే సెప్టెంబర్ నెలలో మార్కెట్ కి మరింత ఉల్లి రాక పెరిగి ఉల్లి రైతులు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.