– రేవంత్‌ను ఫుట్‌బాల్ ఆడుతున్న కాంగ్రెస్
– రేవంత్ ఖజానా చోరీ కేసులో బెయిల్ మీద ఉన్నారు
– కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా
– వీళ్ళే ఓటు చోరీ అని పదం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలతో ఒకవైపున ప్రకృతి వైపరీత్యం కారణంగా కాలువలు పొంగిపోతున్నాయి, వాగులు నిండిపోతున్నాయి, చెరువులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. మరొకవైపు అనేక నగరాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిల్వ ఉండటం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కార్యకర్తలను, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.
ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా , కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రులతో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో చర్చలు జరిపారు. బీజేపీ కార్యకర్తల యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ – ఢిల్లీ మధ్య ముఖ్యమంత్రిని ఫుట్బాల్లా తిప్పేస్తోంది. ఇది కొత్త విషయం కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ – రెండింటిలోనూ ముఖ్యమంత్రులను ఫుట్బాల్లా ఆడుకోవడం తరచుగా చూసిన సంగతే. ప్రస్తుతం ఈ ముఖ్యమంత్రి కూడా అదే పరిస్థితికి లోనై హైదరాబాద్ – ఢిల్లీ కి చక్కర్లు కొడుతూ, రాజకీయంగా నలిగిపోతున్నారు.
ఇది కాంగ్రెస్‌లోని అంతర్గత విభజనకు, రేవంత్ రెడ్డి పరిస్థితికి నిదర్శనం. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని బీహార్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని, తెలంగాణ నుంచి “బీహార్ ట్యాక్స్” వసూలు చేయాలని చూస్తోంది. ఆయనను ఒక పావులా తిప్పుతూ వ్యవహరిస్తున్నారు.
ఒకవైపు ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు ఎదురవుతున్న సమయంలో, కాంగ్రెస్ నేతలు మాత్రం ఓటు చోరీ గురించి కొత్తగా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఓటు చోరీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు.
కొత్తగా పిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని నాయకుడు. ఒకసారి కూడా ధైర్యంగా పోటీ చేయని ఆయనను కేవలం అధిష్టానం నిర్ణయంతో పదవిలోకి తీసుకురావడం జరిగింది. పదవి ఉంది కదా అని పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసుకుంటూ, పాదయాత్రల పేరుతో నాటకాలు చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి ఐ అధ్యక్షులుగా పనిచేసిన అనేక మంది నాయకుల రాజకీయ జీవితం ఖతం అయింది. వారు కాంగ్రెస్‌ను వదిలి వేరే పార్టీలకు వెళ్లి అక్కడక్కడ బ్రతికే ప్రయత్నం చేసిన సందర్భాలు రాష్ట్ర చరిత్రలో ఎన్నో ఉన్నాయి.
నాలుగు పార్టీలు మార్చి వచ్చినవారు ముఖ్యమంత్రి అవుతాడు. సస్పెండ్ అయినవాడిని మళ్లీ తీసుకుంటే, అతనే సీఎల్పీ లీడర్ అవుతారు. ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తరచూ జరిగే విషయమే. గతంలోనూ అనేక మంది నాయకుల పరిస్థితి చూసినా ఇదే నిజం అని అర్థమవుతోంది.
ఇప్పుడు వీళ్ళు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు ఖజానా చోరీలో జైలుకి వెళ్లి, బెయిల్ మీద బయటికి వచ్చిన వారు ఎవరో ప్రజలు మర్చిపోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఖజానా చోరీ కేసులో బెయిల్ మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా అదే పరిస్థితి. అంతేకాదు, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా ఖజానా చోరీ కేసులో బెయిల్ మీద ఉన్నారు అన్నది వాస్తవం కాదా? అయితే ఈ రోజుల్లో వీళ్ళే ఓటు చోరీ అని పదం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు.
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చోరీలకు పాల్పడుతూ, అవి కుంభకోణాలుగా మారి, వారి నాయకులు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటారు. మరొకవైపు కొత్తగా ఓటు చోరీ గురించి మాట్లాడి మా మంత్రులను విమర్శించడం, మా గెలిచిన పార్లమెంట్ సభ్యులను ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దిక్కూ, మొక్కూ లేని పరిస్థితి కనిపిస్తోంది. ఎంఎల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు. పోటీ చేసిన చోట ఘోర ఓటమి ఎదురైంది. అవకాశం ఉన్నప్పటికీ ఎంఐఎంకి వ్యతిరేకంగా పోటీ చేయరు. మరొకచోట తమను రక్షిస్తున్న న్యాయవాదికి వ్యతిరేకంగా పోటీ చేయరు. ఇంత దయనీయమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది వీళ్ళ వ్యవహారం, ఇది వీళ్ళ ఆలోచన. కాబట్టి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానాలని మేము కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతున్నాం.
అసలు పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.. మీనాక్షి నటరాజన్ లేకుండా ఒక్క ఏరియాలోనైనా పాదయాత్రకు వెళ్తే, అతని సొంత పార్టీ వాళ్లే నరకం చూపిస్తున్నారు. అందుకే ఆయన ఎల్లప్పుడూ ఇంచార్జ్ కవచంలోనే తిరుగుతున్నాడు. ఒక అధికార పార్టీకి చెందిన నాయకుడు పాదయాత్ర చేయకుండా, ఆ పార్టీ ఇంచార్జ్ ముందుండి పాదయాత్ర చేయాల్సి రావడం కాంగ్రెస్ పార్టీ నాయకులకే అవమానం. ఇది కాంగ్రెస్ చరిత్రలో జరిగే అతి దౌర్భాగ్యకరమైన పరిస్థితి.
ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. రక్షించండి, కాపాడండి అని కేకలు వేస్తున్నారు. అయితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం బీహార్ టాక్స్ కోసం హైకమాండ్ మెప్పు పొందేందుకు పర్యటనలు చేస్తున్నారు. ప్రజల రక్షణ బాధ్యతలు మరిచి, పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదట తన విధులు నిర్వర్తించాలి.
బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టకముందే న్యాయపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, రాజ్యాంగపరమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్లాల్సి ఉండేది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇక్కడి నుంచే రాజ్యసభకు ఎన్నికైన ఎంపీని, అది కూడా బిఆర్ఎస్–ఎంఐఎం అండతో, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వ్యక్తిని పిలిపించి, న్యాయపరమైన చిక్కులు ఎలా పరిష్కరించాలో అడగడం అసమర్థత, నిర్లక్ష్యం, అనాలోచిత పాలనకు నిదర్శనం.
కాంగ్రెస్ చరిత్ర – సస్పెన్షన్ & రీఎంట్రీల చక్రం. ఇది కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రే ఇది. సస్పెండ్ చేసిన వారినే మళ్లీ పిలిచి పిసిసి అధ్యక్షులుగా చేస్తారు. కొంతమందిని ముఖ్యమంత్రులుగా కూడా చేస్తారు. ఎంఎల్యేలను సస్పెండ్ చేసి, మళ్లీ తీసుకోవడం కూడా ఇలాగే తరచూ జరుగుతుంది. ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ తన కాలాన్ని గడిపేస్తూ వస్తోంది.
బీజేపీ లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ని పూర్తిగా ఓడించి, కాంగ్రెస్‌ని నిలవరించడం. ఆ దిశలోనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేము తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. రాష్ట్రం హితం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుంది.