– ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతున్నారంటూ జీఓ
– దానితో నిరుద్యోగ వర్గాల్లో ఆందోళన
– సోషల్మీడియాలో చక్కర్లు కొట్టిన జీఓ
– చివరకు అది ఫేక్ అని తేల్చిన ప్రభుత్వం
– నిరుద్యోగులను సర్కారుపై ఉసిగొల్పే కుట్ర
– ఉద్యోగుల్లో వ్యతిరేకత పెంచే వ్యూహం
– సర్కారు మేల్కొనడంతో తప్పిన ప్రమాదం
– ఫేక్ జీవో వెనక వైసీపీ ఉందంటూ టీడీపీ ఆరోపణ
అమరావతి: ఉద్యోగులు తనను ఓడించారన్న అక్కసుతో వైసీపీ వారిపై కక్ష-ప్రతీకారం తీర్చుకునే వ్యూహానికి తెరలేపిందా? నిరుద్యోగులకు-ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వైరం పెంచే పన్నాగం పన్నిందా? నిరుద్యోగులను కూటమిపై ఎగదోసే మాయోపాయానికి ఊపిరి పోసిందా?.. తాజాగా సోషల్మీడియాలో ప్రత్యక్షమైన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు ఫేక్ జీఓ పరిశీలిస్తే.. ఇలాంటి అనుమానాలే తెరపైకి రాక తప్పదు.
ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు/ కార్పొరేషన్లు/ సొసైటీలలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీవో ను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
జీవో ఆర్టీ నెం.1575 తేదీ 29- 08- 2025న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రచారం అవుతున్న ఈ జీవో నకిలీది. ఇందులో 62 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉన్నది.
అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెం 1545 తేదీ 22- 08- 2025న విడుదల చేసింది. ఈ వాస్తవ జీవోలో ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు/ కార్పొరేషన్లు/ సొసైటీలలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉన్నది.
దురుద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు తప్పుడు జీవోను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను కూడా నకిలీవి సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
కూటమిపై వైసీపీ కుట్ర?
ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్న నేపథ్యంలో.. నిరుద్యోగులను ఉసిగొప్పి, వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే వ్యూహంతోనే వైసీపీ సోషల్మీడియా ఈ ఫేక్ ఎత్తుగడకు పాల్పడినట్లు కూటమి భావిస్తోంది.
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీన కాకుండా, 14, 15 తేదీ వరకూ జీతాలిచ్చిన పరిస్థితి. ఇక పెన్షనర్లకూ అదే పరిస్థితి. సెర్ప్ లాంటి సంస్థల్లో నెలల తరబడి జీతాలు రాని దయనీయం. దానితో ఉద్యోగులకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నటికీ.. అసలు జీతాలిస్తే చాలన్న పరిస్థితికి చేరారు. దానితో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేసి, కూటమికి జై కొట్టారు.
దానితోపాటు ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాటి సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరికేది కాదు. జగన్ ఐదేళ్ల హయాంలో ఉద్యోగ సంఘ నేతలు ఆయనను కలిసిన సందర్భాలు వేళ్లపై లెక్కించవచ్చు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడంటే అప్పుడు భేటీ అయ్యే వెసులుబాటు వారికి ఉండేది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉద్యోగులు-పెన్షనర్లకు ప్రతి నెల ఒకటవ తేదీన ఠంచనుగా జీతాలు, పెన్షన్లు ఇస్తుండంతో ఆ వర్గాలు ఆనందంతో ఉన్నాయి. అయితే మరికొన్ని దీర్ఘకాలిక సమస్యలున్నప్పటికీ, ప్రభుత్వ ఆర్ధిక కష్టాలు చూస్తున్న ఉద్యోగులు.. ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చి సర్దుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65కి పెంచుతున్నట్లు తాజాగా వచ్చిన ఒక జీఓ కలకలం రేపింది. దానితో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. అదంతా ఉత్తిదేనని, అలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరింది.
ఇలాంటి నకిలీ జీఓలు సృష్టించి, సోషల్మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయడం ద్వారా, నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి.. వారిని ప్రభుత్వంపై ప్రయోగించాలన్న కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, వివరణ ఇవ్వడంతో నిరుద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదంతా వైసీపీ పేటీఎం బ్యాచ్ పన్నాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.