– రెండు సార్లు గెలిచిన తర్వాత పార్టీ మారకుండా విలువలకు కట్టుబడ్డారు
– సభలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ కెటిఅర్ సంతాపం
హైదరాబాద్ : సభలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి సంతాపం తెలపాల్సి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. ఇది అత్యంత విషాదకరం. ఆయన అనారోగ్యం గురించి ఏనాడు ఎవరికీ చెప్పుకోలేదు కానీ, జూబ్లీహిల్స్ ప్రజల కోసం చివరిదాకా పాటుపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం ధనవంతులు మాత్రమే ఉంటారని అనుకుంటారు. కానీ, అది అనేక బస్తీలు కలిగిన పేదల నిలయం.
హైదరాబాద్లో పుట్టి, ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసి, ఎన్టీఆర్ నాయకత్వంలో వీరాభిమానిగా పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ నిలువెత్తు కటౌట్ (రాముడు, కృష్ణుడి రూపంలో) పెట్టింది మొట్టమొదటిసారిగా గోపీనాథ్.
తెలంగాణ నుంచి టీడీపీ మాయం అయిన తర్వాత కేసీఆర్తో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారు. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినా, ఆయన సొంత ఇంటి పరిస్థితి చూస్తే చూస్తే ఆశ్చర్యం కలిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలంతా గోపీనాథ్ ని ‘గోపన్న’ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీర ఇచ్చే సంప్రదాయాన్ని ఆయన తన నియోజకవర్గంలో ప్రారంభించారు.
నియోజకవర్గంలోని పేద ప్రజలందరి కోసం నిరంతరం కృషి చేశారు. గోపన్న బతికినంత కాలం ఒక మాస్ లీడర్ గా పేదల కోసం పనిచేశారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా మా పార్టీపై నమ్మకంతో, విధేయుడిగా ఉండి, రెండు సార్లు గెలిచిన తర్వాత పార్టీ మారకుండా విలువలకు కట్టుబడ్డారు.
ఆయన మరణం మా పార్టీకి, ఆయన కుటుంబానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఆయన అనుచరులకు, శ్రేయోభిలాషులకు తీరనిది. ఈ సమయంలో వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, అసెంబ్లీ వేదికగా సానుభూతి తెలియజేస్తున్నాం. గోపన్న కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. వారి యోగక్షేమాలు చూసుకుంటుంది.